Tuesday, March 4, 2025

అల్హాబాదియాకు సుప్రీంలో ఊరట.. ప్రసారాలకు అనుమతి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ‘ఇండియాస్ గాట్ లాటెండ్’ వేదికగా, వివాదాస్పద వ్యాఖ్యలతో తీవ్ర దుమారం రేపిన యూట్యూబర్ రణ్‌వీర్‌అల్హాబాదియాకు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. సోషల్ మీడియాలో ఫాడ్‌కాస్ట్‌లు, షోలు పునః ప్రారంభించేందుకు ఆయనకు అనుమతి ఇచ్చింది. ఇదే సమయంలో పాడ్‌కాస్ట్ ప్రసారాలు నైతిక ప్రమాణాలకు లోబడి ఉండేలా చూసుకోవాలని , అన్ని వయసుల వారు చూసేలా ఉండాలని షరతులు విధించింది. భావ ప్రకటనా స్వేచ్ఛకు కూడా పరిమితులున్నాయని, అసభ్య పదజాలం వాడటం మంచిది కాదని, మందలించింది. సంజయ్ రైనా యూట్యూబ్ షోలో తల్లితండ్రులు, శృంగారంపై అల్హాబాదియా ఇటీవల చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపడం, పలు రాష్ట్రాల్లో ఎఫ్‌ఐఆర్‌లు నమోదు కావడంతో ఆయన క్షమాపణ చెప్పారు.

తనపై వేర్వేరు చోట్ల నమోదైన అన్ని ఎఫ్‌ఐఆర్‌లను ఒకే చోట చేర్చేలా ఆదేశాలు ఇవ్వాలని సుప్రీం కోర్టును ఆశ్రయించారు.దీనిపై ఇటీవల విచారణ సందర్భంగా ఆహ్లాబాదియాను తీవ్రంగా మందలించిన సుప్రీం ధర్మాసనం ఆయన పాడ్‌కాస్ట్ ప్రసారాలను ఆపేయాలని ఆదేశించింది. అయితే తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకూ అరెస్టు నుంచి ఆయనకు రక్షణ కల్పించింది. ఇదిలా ఉండగా, తన షోలు ప్రదర్శించరాదనే ఆంక్షలను సడలించాలని, తన వద్ద 280 మంది ఉద్యోగులకు ఇదే ఉపాధి అని అల్హాబాదియా మరో పిటిషన్‌లో సుప్రీం కోర్టును కోరారు. దీనిపై సోమవారం విచారణ జరిపిన ధర్మాసనం పాడ్‌కాస్ట్‌ను రద్దు చేయాలన్న ప్రాసిక్యూషన్ వాదనను తిరస్కరించింది. దానిని పునః ప్రారంభించేందుకు యూట్యూబర్‌కు అనుమతి ఇచ్చింది. గౌహతిలో నమోదైన కేసులో దర్యాప్తునకు హాజరు కావాలని కూడా ధర్మాసనం ఆదేశించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News