Saturday, December 28, 2024

జైలు కాదు, బెయిలే

- Advertisement -
- Advertisement -

పోలీసు నిర్బంధం అవసరం లేని కేసుల్లో బెయిల్ మంజూరు చేయడానికి వెనకాడకూడదని, అటువంటి సందర్భాల్లో అలవాటు ప్రకారం కస్టడీకి ఆదేశించరాదని తాను అనేక సార్లు స్పష్టంగా చెప్పినప్పటికీ కింది కోర్టుల న్యాయమూర్తులు పాటించకపోడం పట్ల సుప్రీంకోర్టు సోమవారం నాడు తీవ్ర అసంతృప్తిని, ఆగ్రహాన్ని ప్రకటించింది. బెయిల్ మంజూరు విషయంలో ఉదారంగా వుండాలని తాను గతంలో ఇచ్చిన ఉత్తర్వులను పట్టించుకోకుండా ఒక కేసులో దానిని నిరాకరించిన లక్నో సెషన్స్ జడ్జి ఒకాయనను తీవ్రంగా మందలించి కేసుల విచారణ బాధ్యతల నుంచి తప్పించింది. కింది కోర్టుల జడ్జిలు అరెస్టులు, జైళ్ళు అవసరం లేని కేసుల్లో కస్టడీకి పంపించడం, బెయిల్ నిరాకరించడం మేధాపరమైన నిజాయితీలేని తనమే అవుతుందని న్యాయమూర్తులు సంజయ్ కిషన్ కౌల్, అసనుద్దీన్ అమానుల్లాల ధర్మాసనం అభిప్రాయపడింది.

సుప్రీంకోర్టు ఈ విధంగా తనను శిక్షించడం తన ఉద్యోగ జీవితానికి నష్టం కలిగిస్తుందని లక్నో సెషన్స్ జడ్జి ప్రాధేయపడినప్పటికీ ధర్మాసనం తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. బెయిల్ విషయంలో ఉదారంగా వుండాలని గత ఏడాది జులైలోనే స్పష్టమైన ఉత్తర్వులిచ్చామని, వాటిని ఇంత వరకు ఎందుకు పాటించడం లేదని అడిగింది. ఈ సందర్భంలో ధర్మాసనం వ్యక్తం చేసిన అభిప్రాయాలు ప్రజాస్వామ్యానికి రక్షా కవచాల వంటివి. పోలీసులు అవసరం వున్నా లేకపోయినా అరెస్టులకు పాల్పడడాన్ని అది తప్పుపట్టింది. ప్రజాస్వామ్యంలో పోలీసు రాజ్యానికి చోటు వుండరాదని తెలియజేసింది. ఏడేళ్ళ లోపు శిక్షలకు అవకాశమున్న కేసుల్లో నిరవధికంగా నిర్బంధంలో వుంచడం తగదని చెప్పింది. క్రిమినల్ కోర్టులు ప్రజల స్వేచ్ఛను గౌరవించాలని మరోసారి దిశానిర్దేశం చేసింది. వాస్తవం చెప్పుకోవాలంటే దేశంలో అత్యధిక శాతం పౌరులకు ప్రజాస్వామ్య న్యాయ వ్యవస్థ గురించి బొత్తిగా తెలీదు.

కొత్త వారెవరైనా వస్తూ వుంటే ఇళ్ళూ వూళ్ళూ వదిలేసి పారిపోయే భయస్థులు మారుమూల గిరిజన ప్రాంతాల్లో ఇప్పటికీ తారసపడుతుంటారు. పోలీసులు కనుచూపు మేరలో కనిపిస్తే వారు ఎంతగా భయోత్పాతం చెంది ఉరకలేస్తారో చెప్పనక్కర లేదు. విశాఖ ఏజెన్సీలో నక్సల్స్ కోసం గాలింపు విధులపై వెళ్ళి అక్కడి ఆదివాసీ స్త్రీలపై పోలీసులు అత్యాచారానికి తలపడిన కేసు గురించి తెలిసిందే. అంత దూరం పోనక్కర లేదు. నాగరక ప్రపంచంలో కూడా ఇంటికి పోలీసు వస్తున్నాడంటే ఆందోళన చెందేవారు ఇప్పటికీ వున్నారు. ఎందుకొచ్చారు, అరెస్టు వారంటేది అని అడిగే ధైర్యం వారిలో వుండదు. ఇటువంటి నేపథ్యంలో కింది కోర్టుల న్యాయమూర్తులు తరచూ బెయిల్ నిరాకరిస్తూ వుంటే నిస్సహాయంగా ఏళ్ళ తరబడి జైలు జీవితం అనుభవించడం తప్ప సాధారణ జనానికి వేరే మార్గం ఏముంటుంది? ఈ దుస్థితిని గమనించిన తర్వాతనే గత ఏడాది సుప్రీంకోర్టు బెయిల్ మంజూరుపై మార్గదర్శక సూత్రాలను ప్రకటించింది.

బెయిల్ మంజూరు విధానాన్ని క్రమబద్ధం చేస్తూ ఎటువంటి సందర్భాల్లో మంజూరు చేయాలో స్పష్టంగా పేర్కొంటూ ఒక ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చే విషయం పరిశీలించాలని 2022 జులై 11న సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. అరెస్టు అనేది కఠినాతి కఠినమైన చర్య అని అది స్వేచ్ఛను హరిస్తుందని పేర్కొన్నది. అందుచేత అరెస్టును అత్యంత అరుదుగా గాని ప్రయోగించరాదని సూచించింది. ప్రజాస్వామ్యం, పోలీసు రాజ్యం పరస్పరం విరుద్ధమైనవని అనుమానానికి ఆస్కారం లేకుండా చెప్పింది. ఒకే రకమైన నేరారోపణ గల వ్యక్తులకు భిన్నమైన శిక్షలు విధించరాదని, ఆరోపణ ఏదైనప్పటికీ అదే పనిగా విచారణ కొనసాగిస్తూ పోరాదని, కఠినంగా వ్యవహరించరాదని, అది రాజ్యాంగం 21వ అధికరణకు విరుద్ధమని చెప్పింది.

చట్టం పేర్కొన్న విధంగా తప్ప ఏ వ్యక్తి ప్రాణాన్ని, వ్యక్తిగత స్వేచ్ఛను హరించరాదని 21వ అధికరణ చెబుతున్నది. గత ఏడాది ఆగస్టులో సతీందర్ కుమార్ కేసులో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరుకు సంబంధించి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. నిందితులకు రాజ్యాంగం కల్పిస్తున్న వ్యక్తిగత స్వేచ్ఛ తదితర హామీలను గురించి అందులో ప్రస్తావించింది. కొన్ని సందర్భాల్లో జామీనుకు అవకాశం లేని వారంట్లను సైతం జామీను ఇవ్వదగినవిగా మార్చవచ్చునని అందులో స్పష్టం చేసింది. బెయిల్ దరఖాస్తుపై తుది నిర్ణయం తీసుకొనే లోగా తాత్కాలిక బెయిల్‌ను కూడా మంజూరు చేయవచ్చునని చెప్పింది. పోలీసులు అరెస్టు చేసే ముందు దాని ఆవశ్యకత ఏ మేరకుందో పదేపదే తమను తాము ప్రశ్నించుకోవాలని పేర్కొన్నది. పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛపై దేశ అత్యున్నత న్యాయస్థానం ఇంత స్పష్టంగా, ప్రజాస్వామ్యబద్ధంగా వున్నప్పుడు పోలీసులు, కింది న్యాయస్థానాలు ఆయా కేసుల్లో బెయిల్ ఇవ్వకుండా నిరవధికంగా నిందితులను వేధించడం ఎంత మాత్రం సమంజసం కాదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News