సెంట్రల్ విస్టా ప్రాజెక్టుకు ఓకె
21 మెజారిటీ తీర్పుతో గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన సుప్రీంకోర్టు
నిర్మాణ స్థలంలో స్మాగ్ టవర్లు, యాంటీ స్మాగ్ గన్స్ ఏర్పాటు చేయాలని సూచన
న్యూఢిల్లీ: నూతన పార్లమెంటు భవనంతో పాటుగా కేంద్ర ప్రభుత్వ సచివాలయాన్ని నిర్మించడానికి ఉద్దేశించిన సెంట్రల్ విస్టా ప్రాజెక్టుకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పర్యావరణ అనుమతులు, ప్రాజెక్టు డిజైన్‌పై కేంద్ర ప్రభుత్వ వాదనలతో ధర్మాసనం ఏకీభవించింది. డిడిఎ చట్టం కింద చేపట్టిన ఈ ప్రాజెక్టు చట్టబద్ధమైనదేనని, పర్యావరణ మంత్రిత్వ శాఖ ఇచ్చిన అనుమతులు, స్థలం కేటాయింపులు కూడా సరిగ్గానే ఉన్నాయని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. అయితే ప్రాజెక్టు నిర్మాణ స్థలంలో కాలుస్యాన్ని తగ్గించే స్మాగ్ టవర్లు(చిమ్నీ లాంటివి) ఏర్పాటు చేయాలని, యాంటీస్మాగ్ గన్‌లను ఉపయోగించాలని ఆదేశించింది.సెంట్రల్ విస్టా ప్రాజెక్టు నిర్మాణానికి హెరిటేజ్ కన్జర్వేషన్ కమిటీ అనుమతి అవసరమని, వెంటనే ఆ అనుమతులు తెచ్చుకోవాలని సూచించింది. సెంట్రల్‌విస్టా ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలైన విషయం తెలిసిందే. పర్యావరణ అనుమతులు, ప్రాజెక్టు డిజైన్, స్థలం కేటాయింపు వంటి వాటిని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై జస్టిస్ ఎఎం ఖన్విల్కర్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం గతంలో విచారణ చేపట్టింది. అన్ని పక్షాల వాదనలు విన్న అనంతరం తీర్పును రిజర్వ్ చేసింది.
మంగళవారం ప్రాజెక్టుకు గ్రీన్‌సిగ్నల్ ఇస్తూ తీర్పు వెలువరించింది. కేంద్రం వాదనలతో జస్టిస్ ఖన్విల్కర్, జస్టిస్ దినేశ్ మహేశ్వరి ఏకీభవించగా, జస్టిస్ సంజీవ్ ఖన్నా వ్యతిరేకించారు. దీంతో 21మెజారిటీతో సుప్రీంకోర్టు తీర్పు వెలవరించింది. అయితే సుప్రీంలో విచారణ పెండింగ్‌లో ఉండగానే సెంట్రల్ విస్టా ప్రాజెక్టు శంకుస్థాపనకు న్యాయస్థానం అనుమతించింది. అయితే ఇప్పుడే ఎటువంటి నిర్మాణాలు చేపట్టవద్దని స్పష్టం చేసింది. తుది తీర్పు వచ్చాకే ప్రాజెక్టు పనులు చేపట్టాలని స్పష్టం చేసింది. ఇందుకు కేంద్రం కూడా అంగీకరించింది. దీంతో గత ఏడాది డిసెంబర్ 10న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సెంట్రల్ విస్టాకు శంకుస్థాపన చేశారు.ప్రజాస్వామ్య దేవాలయంగా పరిగణించే పార్లమెంటు నూతన భవనంలో అణువణువునా భారతీయత ప్రతిబింబించ నుంది. లోక్‌సభ పైకప్పు పురివిప్పి ఆడుతున్న నెమలి ఆకృతిలో, రాజ్యసభ పైకప్పు విరబూసిన కమలం రూపంలో ఉండనున్నాయి. జాతీయ వృక్షమైన మర్రిచెట్టు పార్లమెంటులో అంతర్భాగంగా నిలవనుంది.
Supreme Court approval to Central Vista Project