Wednesday, January 22, 2025

రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి!

- Advertisement -
- Advertisement -

ఆర్టికల్ 370 రద్దును సమర్థిస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) ఎజెండాను బలపరుస్తున్నది .నరేంద్ర మోడీ రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత హిందూ రాష్ట్రం వైపుగా పాలన వేగాన్ని పెంచాడు. రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) జమ్మూ మరియు కాశ్మీర్ స్వయం ప్రతిపత్తిని రద్దు చేయాలని 27 తీర్మానాలను చేసింది.భారతదేశం భిన్న భాషల, జాతుల, సంస్కృతుల, కుల, తెగల, మతాలతో కూడుకున్న దేశం. ఆచార వ్యవహారాలు జీవన సంస్కృతులు భిన్నంగా ఉంటాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రూపొందించారు.భారతదేశం 1947 ఆగస్టు 15 తర్వాత సొంత రాజ్యాంగాన్ని రాసుకున్నది. 1949 నవంబర్ 26వ తేదీన భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్తుకు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సమర్పించగా రాజ్యాంగ పరిషత్ ఆమోదించింది. అది జరిగిన నాలుగు రోజులలోపే నవంబర్ 30వ తేదీన ఆర్‌ఎస్‌ఎస్ అధికార పత్రిక ‘ఆర్గనైజర్‘ లో భారత రాజ్యాంగాన్ని తిరస్కరిస్తున్నామని ఆర్‌ఎస్‌ఎస్ ప్రకటించింది. అదేవిధంగా 1950 జనవరి 11న ‘ఆర్గనైజర్‘ లో మరొకసారి భారత రాజ్యాంగం గా మనుస్మృతి ఉండాలని మరొక వ్యాసం రాసింది .

వాజ్ పాయ్ ప్రధానమంత్రి అయినదాకా వారు జాతీయ జెండాను ఎగురవేయలేదు.
జాతిపిత మహాత్మా గాంధీని హత్య చేసిన నాథూరామ్ గాడ్సే తో పాటు, సావర్కర్ కూడా ముద్దాయే. సామ్రాజవాదానికి లొంగిపోతు అనేక లొంగుబాటు క్షమా బిక్ష పిటిషన్లు రాశాడు. స్వతంత్ర సాక్ష్యం లేదనే పేరుతో సావర్కర్ ను నిర్దోషిగా సెషన్స్ కోర్టు ప్రకటించింది. మహాత్మా గాంధీ హత్యపై జీవన్ లాల్ కపూర్ కమిషన్ సావర్కర్ ముద్దాయి అనే విషయాన్ని నిర్ధారించింది. ప్రధాని నరేంద్ర మోడీ సావర్కర్ చిత్రపటాన్ని పార్లమెంట్లో పెట్టారు.భారత రాజ్యాంగ పీఠికలో భారతదేశం సర్వసత్తాక స్వతంత్ర గణతంత్ర సామ్యవాద ప్రజాతంత్ర లౌకిక రాజ్యంగా పేర్కొనబడింది. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి భారత రాజ్యాంగం యొక్క మౌలిక స్వభావాన్ని మార్చటానికి పాలనా ప్రయాణం మొదలుపెట్టింది.
ఒకే దేశం ఒకే ప్రజ ఒకే చట్టం పేరుతో మొత్తం పాలనను కాషాయ కార్పోరేటికరణ చేయటానికి హిందూ రాష్ట్రం వైపుగా ప్రయాణం చేస్తున్నది. ఏకీకృత పన్ను పేరుతో ‘సరుకులు సేవలు పన్నుల చట్టాన్ని‘(జీఎస్‌టి) తీసుకొచ్చి రాష్ట్రాలను మున్సిపాలిటీల స్థాయికి దిగజార్చింది. సిఎఎ, ఎన్‌పిఆర్, ఎన్‌ఆర్‌సి చట్టాలను తీసుకొచ్చి ముస్లిం ఫోబియోను రెచ్చగొట్టింది. ప్రపంచం మొత్తం కరోనామహమ్మారి పడిన సమయంలో కాషాయ కార్పొరేట్లకు వ్యవసాయ రంగాన్ని అంబానీ, ఆదాని లకు అప్పజెప్పటానికి మూడు వ్యవసాయ నల్ల చట్టాలను తీసుకొచ్చింది.

30 కార్మిక చట్టాలను రద్దు చేస్తూ నాలుగు లేబర్ కోడ్లను తీసుకొచ్చింది. ఈ లేబర్ కోడ్‌ల వల్ల స్వాతంత్ర అనంతరం కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నటువంటి అనేక చట్టాలు ఫలితం లేకుండా పోయాయి. ఎనిమిది గంటల పని దినం పోయింది. ఎల్‌ఐసి, రైల్వేలు, నౌకాశ్రయాలు, విమానాశ్రయాలు, రోడ్లు ను ప్రైవేట్ పరం చేసింది. చివరకు మిలిటరీని కూడా ప్రైవేటుపరం చేయటానికి భాజాభా ప్రభుత్వం పూనుకున్నది. మణిపూర్ రాష్ట్రంలో ఉన్న సహజ వనరులను కార్పొరేట్ల పరం చేయటానికి మైనార్టీలను కోర్టు తీర్పు పేరుతో మైతి, నాగా, కుకీ తెగల మధ్య వైరుధ్యం పెట్టి మారణకాండ సృష్టించింది. సుప్రీంకోర్టు తీర్పు పేరుతో అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మిస్తున్నాడు. లౌకిక విలువలకు తిలోదకాలిచ్చి సాక్షాత్తు ప్రధానమంత్రి రామ మందిరం శంకుస్థాపన చేశాడు. నూతన పార్లమెంటు భవన ప్రారంభోత్సవానికి గిరిజన మహిళ అయిన రాష్ట్రపతిని ఆహ్వానించలేదు.
ప్రపంచంలోనే సుదీర్ఘ చరిత్ర కలిగినటువంటి ఫాసిస్టు సంస్థ ఆర్‌ఎస్‌ఎస్. 2001 నాటికి దాని యొక్క సభ్యుల సంఖ్య 60 లక్షల మంది పైగా ఉన్నారు. దాని రాజకీయ సంస్థ అయిన బిజెపికి 20 కోట్ల మంది సభ్యులున్నారు.

1925 వ సంవత్సరం విజయదశమి నాడు హిందూ మహాసభ నాయకుడు డాక్టర్ కేశవ్ బలిరాం హెడ్డే వార్ చే నాగపూర్‌లో రాష్ట్రీయ స్వయంసేవక సంఘ (ఆర్‌ఎస్‌ఎస్ )స్థాపించబడింది. ఆయన రాజకీయ గురువు బి.ఎస్.మూంజె. ఈయన రౌండ్ టేండ్ సమావేశాల్లో పాల్గొన్నారు. ఆయన ఇటలీ నియంత ముస్సోలిని 1931వ సంవత్సరంలో కలిశాడు. ఇటలీలో నియంత ముస్సోలిని ఏర్పాటుచేసిన తరహా సైనిక స్కూల్ ను నాసిక్ దగ్గర బన్సాలలో ఏర్పాటు చేశారు.
ఇండియన్ యూనియన్‌లో భాగమైనప్పుడు విలీన ఒప్పందంపై సంతకం చేసిన ఇతర రాచరిక రాష్ట్రాల మాదిరిగా కాకుండా, విలీన ఒప్పందంపై సంతకం చేయడానికి బదులుగా, ఇన్‌స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ ఆధారంగా మిగిలిన భారతదేశంలో చేరిన ఏకైక రాష్ట్రం జమ్మూ మరియు కాశ్మీర్. దీని ప్రకారం, ఆర్టికల్ 370లో నిర్దేశించబడినట్లుగా మరియు ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్కు అనుగుణంగా, జమ్ము మరియు కాశ్మీర్ కోసం, రక్షణ, విదేశీ వ్యవహారాలు మరియు కమ్యూనికేషన్ల కోసం మాత్రమే చట్టాలను రూపొందించే హక్కు కేంద్రానికి ఉంది. ఇతర కేంద్ర చట్టాలు జమ్ము మరియు కాశ్మీర్ రాష్ట్ర అసెంబ్లీ అంగీకరించినప్పుడు మాత్రమే జమ్మూ మరియు కాశ్మీర్ రాష్ట్రానికి వర్తిస్తాయి.

జమ్ము మరియు కాశ్మీర్ ప్రజల ప్రయోజనాలను మరింతగా కాపాడేందుకు, ప్రజల అభీష్టాన్ని నిర్ధారించే అంతర్గత ప్రజాభిప్రాయ సేకరణ కోసం డాక్టర్ అంబేద్కర్ కూడా మద్దతునిచ్చిన విషయం ఈ సందర్భంగా చెప్పాలి. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల( ఈ డబ్ల్యూ ఎస్) పేరుతో సుప్రీంకోర్టు రిజర్వేషన్లు సమర్ధించటాన్ని కాషాయ కార్పొరేట్ ఎజెండాలో భాగమే. సర్వోత్తమనే సర్వోన్నత న్యాయస్థానం న్యాయమూర్తులు పదవి విరమణ తర్వాత గవర్నర్లుగా, రాజ్యసభ సభ్యులుగా వివిధ రాజకీయ పదవులు పొందుతున్న సంగతి చూస్తున్నదే.
జమ్మూ కాశ్మీర్ లోని సంపదను కార్పొరేట్ల పరం చేయటానికి కేంద్ర ప్రభుత్వం పూనుకున్నది. భారత అత్యున్నత న్యాయస్థానం ఇస్తున్నటువంటి అనేక తీర్పులు ఈ విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాయి.

ఇది కాకుండా, 2019 ఆగస్టులో మోడీ పాలనలో రాష్ట్రపతి పాలనలో ఉన్న సమయంలో జమ్ము & కాశ్మీర్ ను జమ్మూ కాశ్మీరు మరియు లడక్ అనేరెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విడదీసే ప్రశ్నపై తీవ్రమైన న్యాయపరమైన , రాజ్యాంగపరమైన ఉల్లంఘనలు, దాట వేతలు ఉన్నాయి. ఇక్కడ సమాఖ్య సూత్రాలు మరియు రాజ్యాంగ విధానాలను ఉల్లంఘించబడ్డాయి.
ఉమర్ అబ్దుల్లా, మెహబూబా లాంటి నాయకులు మరి కొంతమంది ఇతర జమ్మూ మరియు కాశ్మీరు నాయకులు ఇప్పటికీ గృహ నిర్బంధంలో ఉన్నారు. అయినప్పటికీ, ఆర్‌ఎస్‌ఎస్ ఎటువంటి ఆలస్యం లేకుండా ఆర్టికల్,370 తీర్పును హృదయపూర్వకంగా కొద్ది గంటల్లోనే స్వాగతించింది. ఈ క్లిష్ట సమయంలో భారత రాజ్యాంగ మౌలిక స్వభావాన్ని రక్షించుకోవటానికి భారతీయులైన ప్రతి ఒక్కరూ పూనుకోవాలి!

మన్నవ హరిప్రసాద్
9346508846

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News