ఉత్తర ప్రదేశ్‌లోని సంభాల్ జిల్లా చందౌసి ప్రాంతంలో మోఘలుల కాలం నాటి షాహి జమా మసీదు, దాని సర్వేపై కేసులో విచారణ ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేయాలని సంభాల్ ట్రయల్ కోర్టును సుప్రీం కోర్టు శుక్రవారం ఆదేశించింది. కల్లోలిత పట్టణంలో శాంతి, సామరస్యాలను పరిరక్షించవలసిందిగా యుపి ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. మొఘల్ చక్రవర్తి బాబర్ 1526లో ఒక ఆలయాన్ని కూల్చివేసి మసీదు నిర్మించినట్లు పేర్కొంటూ హిందూ పక్షం నుంచి దాఖలైన పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకున్న తరువాత ఒక అడ్వొకేట్ కమిషనర్‌లో మసీదు సర్వేకు సంభాల్ సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్) కోర్టు ఈ నెల 19న ఎక్స్‌పార్టీ ఉత్తర్వు జారీ చేసింది.
ఆ ఉత్తర్వు పర్యవసానంగా 24న ఆ ప్రాంతంలో హింసాత్మక సంఘటనలు చోటు చేసుకోగా నలుగురు వ్యక్తులు మరణించారు. ప్రధాన న్యాయమూర్తి (సిజెఐ) సంజీవ్ ఖన్నా, న్యాయమూర్తి సంజయ్ కుమార్‌తో కూడి న ధర్మాసనం సంభాల్ జిల్లాలో శాంతిని కాపాడవలసిన ప్రాధ్యానం గురించి శుక్రవారం ఉద్ఘాటించింది. మసీదు సర్వే తరువాత కోర్టు కమిషనర్ సిద్ధం చేసే నివేదికను సీల్ చేయాలని, తిరిగి ఉత్తర్వులు జారీ చేసేంత వరకు తెరవరాదని బెంచ్ ఆదేశించింది. ట్రయల్ కోర్టు సర్వే ఉత్వర్వుపై షాహి జమా మసీదు కమిటీ దాఖలు చేసే పిటిషన్‌ను మూడు పని దినాల్లోగా అలహాబాద్‌హైకోర్టు ముందు జాబితాలో చేర్చాలని కూడా బెంచ్ ఆదేశించింది. ట్రయల్ కోర్టు ముందు ఈ వ్యవహారాన్ని జనవరి 8న విచారణకు నివేదించాలని బెంచ్ సూచించింది.