Monday, November 18, 2024

సుప్రీం కోర్టులో “లైవ్ ట్రాన్‌స్క్రిప్షన్”… తొలిసారి ప్రయోగాత్మకంగా..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : న్యాయవ్యవస్థలో ఆధునిక సాంకేతికతను మరింత వినియోగించుకునే దిశగా సుప్రీం కోర్టు మరో అడుగు ముందుకేసింది. కృత్రిమ మేథ, సహజ భాషా విశ్లేషణ, సాంకేతికతల సాయంతో సర్వోన్నత న్యాయస్థానం తొలిసారి తన విచారణను ప్రత్యక్షంగా లిఖిత పూర్వక మార్పిడి ( లైవ్ ట్రాన్‌స్క్రిప్షన్ )చేసింది. మంగళవారం నుంచి ఈ ప్రక్రియకు ప్రయోగాత్మకంగా శ్రీకారం చుట్టింది. భారత ప్రధాన న్యాయమూర్తి (సిజెఐ) జస్టిస్ డీవై చంద్రచూడ్ కోర్టు రూంలో ఈ లైవ్ ట్రాన్ స్క్రిప్షన్‌ను ప్రారంభించారు. మహారాష్ట్ర రాజకీయాలకు సంబంధించిన వ్యాజ్యంపై సీజేఐ నేతృత్వం లోని రాజ్యాంగ ధర్మాసనం చేపట్టిన వాదనలను ఈ సందర్భంగా సాంకేతికత సాయంతో లైవ్‌లో ప్రతిలేఖనం చేశారు.

సుప్రీం కోర్టు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయడానికి ముందు పరిశీలన కోసం సంబంధిత ప్రతులను న్యాయవాదులకు అందజేయనున్నారు. ఇదొక సాధారణ ప్రక్రియగా కొనసాగడానికి ముందు అందులోని లోటుపాట్లను సవరించేందుకు వీలుగా ఒకటి లేదా రెండు రోజులపాటు ప్రయోగాత్మక ప్రాతిపదికగా ఈ ప్రక్రియ చేపడతామని సీజేఐ తెలిపారు. “ తెరపై చూస్తున్నారా ? కోర్టు వాదనలను ప్రత్యక్షంగా లిఖిత పూర్వకంగా మార్పిడి చేసే అవకాశాలను పరిశీలిస్తున్నాం. అనంతరం శాశ్వత రికార్డులను నమోదు చేస్తాం. ఇది న్యాయమూర్తులు, న్యాయవాదులకు ఉపయుక్తంగా ఉంటుంది. వాదనలు ఎలా జరుగుతాయో న్యాయ కళాశాలలు కూడా విశ్లేషించవచ్చు” అని సీజేఐ నేతృత్వం లోని రాజ్యాంగ ధర్మాసనం పేర్కొంది. ఇదిలా ఉండగా, గతేడాది సెప్టెంబరు 27 నుంచి రాజ్యాంగ ధర్మాసనం కేసుల విచారణల ప్రత్యక్ష ప్రసార సేవలు ప్రారంభమైన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News