Monday, November 18, 2024

“పిండం గుండె చప్పుడు” ఆపాలని ఏ కోర్టు చెబుతుంది ?

- Advertisement -
- Advertisement -

26 వారాల గర్భస్థ శిశువు పై వైద్య నివేదిక… సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు

న్యూఢిల్లీ : గర్భ విచ్ఛిత్తికి సంబంధించిన ఓ కేసులో భారత సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. 26 వారాల గర్భస్థ శిశువు బతికే అవకాశాలు బలంగా ఉన్నాయంటూ వైద్యబృందం ఇచ్చిన తాజా నివేదికపై సుప్రీం కోర్టు స్పందించింది. పిండం గుండె చప్పుడును ఆపాలని ఏ కోర్టు చెబుతుందని ప్రశ్నించింది. గతంలో గర్భ విచ్ఛిత్తికి అనుమతివ్వగా తాజాగా గర్భస్థ శిశువు బతికే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వైద్యులు చెప్పడంపై సుప్రీం కోర్టు ఇలా వ్యాఖ్యానించింది.

తన గర్భవిచ్ఛిత్తికి అనుమతించాలని కోరుతూ ఇద్దరు పిల్లలున్న ఓ వివాహిత సుప్రీం కోర్టును ఆశ్రయించారు. తాను కుంగుబాటుతో బాధపడుతున్నానని , మూడో చిన్నారిని పెంచేందుకు ఆర్థికంగా , మానసికంగా సిద్ధంగా లేనని పేర్కొన్నారు. వీటిని పరిగణన లోకి తీసుకున్న సుప్రీం కోర్టు … ఎయిమ్స్ వైద్యుల నివేదిక మేరకు ఆ వివాహిత గర్భవిచ్ఛిత్తికి అక్టోబర్ 9న అనుమతిచ్చింది. అయితే అప్పటికే గర్భిణీకి 25 వారాలు దాటడంతో కేంద్రం సుప్రీంను ఆశ్రయించింది.

ఈ క్రమంలో వివాహితను పరిశీలించిన వైద్యబృందం … పిండం బతికి ఉండే అవకాశాలు కచ్చితంగా ఉన్నాయంటూ తాజా నివేదిక ఇచ్చింది. ఈ నివేదికపై కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనాన్ని ఆశ్రయించగా.. గర్భ విచ్ఛిత్తిని తాత్కాలికంగా వాయిదా వేయాలని అక్టోబర్ 10 న ఎయిమ్స్ వైద్యులను ఆదేశించింది. తాజాగా ఈ కేసును జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ బీవీ నాగరత్నలతో కూడిన ధర్మాసనానికి సిఫార్సు చేయగా బుధవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా గర్భ విచ్ఛిత్తి వల్ల మహిళకు ఎటువంటి సమస్య ఉండదని వైద్యులు తొలుత ఇచ్చిన నివేదికను సుప్రీం ధర్మాసనం ప్రస్తావించింది.

వైద్యులు ఇచ్చిన తాజా నివేదిక పట్ల సుప్రీం ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. గర్భస్థ శిశువు బతికి ఉండే అవకాశాల గురించి ఇంత కచ్చితంగా అప్పుడెందుకు చెప్పలేక పోయారు? అని ప్రభుత్వం తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్యభాటీని ప్రశ్నించింది. జీవం ఉన్న గర్భస్థ శిశువు గుండె చప్పుడును ఆపాలని ఏ కోర్టు చెబుతుంది? అలా ఏ కోర్టు చేస్తుంది ? నా విషయానికి వస్తే నేనలా చేయను” అని జస్టిస్ హిమా కోహ్లీ అభిప్రాయపడ్డారు. అనంతరం సదరు మహిళ, ఆమె భర్తతో వర్చువల్‌గా మాట్లాడి తాజా నివేదిక లోని అంశాలు వివరించారు. తదుపరి తుది నిర్ణయాన్ని చెప్పాలని ఆ మహిళ తరఫున పిటిషనర్‌కు సూచించారు.

మరోవైపు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వం లోని ధర్మాసనం ముందు ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రస్తావించడం పట్ల జస్టిస్ నాగరత్న ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఒక ధర్మాసనం నిర్ణయం తీసుకుంటున్నప్పుడు ఎటువంటి విజ్ఞప్తి లేకుండా సిజేఐ త్రిసభ్య ధర్మాసనం ముందు ఎలా అప్పీలు చేస్తారని ప్రశ్నించింది. కేంద్ర ప్రభుత్వమే ఇలా చేస్తే రేపు ప్రైవేట్ పార్టీలు కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తాయి. సుప్రీం కోర్టు లోని అన్ని ధర్మాసనాలు అత్యున్నతమైనవే అంటూ కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించింది.

దేశంలో మహిళల గర్భ విచ్ఛిత్తి హక్కులపై ఇటీవలే సుప్రీం కోర్టు చరిత్రాత్మక తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. సురక్షితంగా , చట్టపరంగా 20 నుంచి 24 వారాల్లోపు గర్భస్రావం చేయించుకునే మహిళలందరికీ ఉందని స్పష్టం చేసింది. దీని ప్రకారం , 24 వారాల్లోపే గర్భవిచ్ఛిత్తికి అనుమతి ఉంటుంది. కానీ ఈ కేసులో 25 వారాలకు మించి కావడంతో సదరు వివాహిత సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News