Saturday, November 23, 2024

ప్రభుత్వాన్ని విమర్శించిందని మీడియా ఛానెల్‌ను నిషేధించకూడదు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : మలయాళ వార్తా ఛానెల్ ‘ మీడియావన్ ’కు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. భద్రతా కారణాల రీత్యా ఈ ఛానల్‌పై కేంద్రం విధించిన నిషేధాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసింది. ఈ సందర్భంగా కేంద్రం తీరుపై సుప్రీం కోర్టు అసహనం వ్యక్తం చేసింది. ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నదన్న కారణంతో ఓ మీడియా సంస్థ గొంతు నొక్కలేరని వ్యాఖ్యానించింది. భద్రతా కారణాల రీత్యా మీడియా వన్ ప్రసారాలను నిలిపివేస్తూ ఆ ఛానెల లైసెన్సును రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం గతేడాది జనవరి 31న ఆదేశాలు జారీ చేసింది. కేంద్రం నిర్ణయాన్ని కేరళ హైకోర్టు కూడా సమర్ధించింది. దీంతో ఆ మీడియా ఛానెల్ సుప్రీం కోర్టును ఆశ్రయించగా, ఈ నిషేధంపై గతేడాది మార్చిలో స్టే విధించింది.

తాజాగా దీనిపై మరోసారి విచారణ చేపట్టిన సీజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వం లోని ధర్మాసనం, మీడియా స్వతంత్రతపై కీలక వ్యాఖ్యలు చేసింది. “ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఎలాంటి ప్రసారాలను గుర్తించలేదు. కేవలం ఊహాగానాలను ఆధారంగా చేసుకుని భద్రతా కారణాలంటూ ఆరోపించకూడదు. ప్రజల హక్కులను తోసిపుచ్చేందుకు దేశ భద్రతను కారణంగా చూపించకూడదు. కేవలం విమర్శలు చేసిందన్న కారణంతో టీవీ ఛానల్ లైసెన్సును రద్దు చేయడం సరికాదు. మీడియా కచ్చితంగా ప్రభుత్వానికి మద్దతుగా ఉండాలనే వైఖరిని అనుమతించకూడదు. బలమైన ప్రజాస్వామ్యానికి మీడియా స్వతంత్రత చాలా ముఖ్యం. ప్రజాస్వామ్య సమాజంలో దాని పాత్ర అత్యంత కీలకం” అని సీజేఐ చంద్రచూడ్ ధర్మాసనం వ్యాఖ్యానించింది. మీడియా వన్ లైసెన్సులను పునరుద్ధరించకుండా కేంద్ర సమాచార, ప్రసార శాఖ ఇచ్చిన ఆదేశాలను కోర్టు కొట్టివేసింది.

సీల్డ్ కవర్ పైనా ఆగ్రహం…
ఈ కేసులో ప్రభుత్వం సీల్డు కవర్‌లో దస్త్రాలను సమర్పించడాన్ని న్యాయస్థానం తీవ్రంగా తప్పుబట్టింది. “ కోర్టు ఎదుట విచారణ జరుగుతున్నప్పుడు ఇతర పక్షాలకు సమాచారాన్ని బహిర్గతం చేయకుండా ప్రభుత్వానికి ఎలాంటి మినహాయింపులు ఉండవు. అన్ని దర్యాప్తు నివేదికలను రహస్యంగా ఉంచడం కుదరదు. పౌరుల హక్కులు, స్వేచ్ఛను ప్రభావితం చేసే అంశాలను బయటకు వెల్లడించాలి ” అని ధర్మాసనం అభిప్రాయపడింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News