ఉన్నత న్యాయమూర్తుల నియామకాలపై కొలీజియం వ్యవస్థను కేంద్రంలోని బిజెపి పెద్దలు తీవ్రంగా తప్పుపడుతూ పదేపదే ఘాటు విమర్శలు సంధిస్తున్న నేపథ్యంలో అదే కొలీజియం వారిని అమితంగా సంతృప్తి పరిచే నిర్ణయం తీసుకోడాన్ని, దానిని ప్రశ్నిస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు తిరస్కరించడాన్ని ఏమనుకోవాలి? బిజెపి పాలకులు ఏమి ఆశించి కొలీజియంను మాటల కొరడాలతో బాధిస్తూ వచ్చారో దానినే అది నెరవేస్తున్నప్పుడు జాతీయ న్యాయ నియామకాల కమిషన్‌ను పునరుద్ధరించాల్సిన అవసరం కలగదు. రోగి కోరిందే వైద్యుడు సూచించినప్పుడు పేచీకి ఆస్కారం ఏముంటుంది? భారతీయ జనతా పార్టీలో చురుకైన పాత్ర పోషిస్తూ మైనారిటీ మతాలైన ఇస్లాం, క్రైస్తవాలపై విద్వేష వ్యాప్తికి దోహదం చేసే అభిప్రాయాలను ప్రకటించిన చెన్నై మహిళా న్యాయవాది విక్టోరియా గౌరిని మద్రాస్ హైకోర్టు అదనపు జడ్జీగా నియమించడానికి గత జనవరి 17న సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది.
దానికి కేంద్రం ఆమోద ముద్ర కూడా లభించి ఆమె ప్రమాణ స్వీకారం సైతం జరిగిపోయింది. దీనిని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై మంగళవారం ఉదయం సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టడం, ఆమె మద్రాస్ హైకోర్టులో పదవీ స్వీకార ప్రమాణం చేయడం ఇంచుమించు ఒకే సమయంలో జరిగిపోయాయి. ఈ నేపథ్యంలో సుప్రీం ధర్మాసనం ఈ నియామకంపై దాఖలైన పిటిషన్లను త్రోసిపుచ్చింది. “న్యాయమూర్తుల నియామకం కోసం మనకు పటిష్ఠమైన వడపోత ప్రక్రియ వున్నది. కొలీజియం అన్ని విషయాలనూ సమగ్రంగా పరిశీలించలేదనే అభిప్రాయం సరైనది కాకపోవచ్చు. న్యాయమూర్తి పదవికి ఆమె యోగ్యతకు సంబంధించిన అంశాల్లోకి మేము వెళ్ళదలచుకోలేదు. దానిని పునః పరిశీలించాలని కొలీజియంను ఆదేశించలేము” అని పేర్కొంటూ సుప్రీం ధర్మాసనం ఈ విషయాన్ని పక్కన పెట్టింది. ఈ సందర్భంలో పలు రకాల అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. గౌరి భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పని చేశారు.
ఈ విషయాన్ని ఆమె స్వయంగా ట్వీట్ చేసినట్టు సమాచారం. అదొక ఎత్తు అయితే ఇస్లాంది ఆకుపచ్చని ఉగ్రవాదమైతే, క్రైస్తవానిది తెలుపు ఉగ్రవాదమని గౌరి 2018లో ఇచ్చిన ఒక ఇంటర్వూలో పేర్కొన్నారు. అంతేకాదు ఈ రెండు మతాల మధ్య ‘లౌజిహాద్’ నడుస్తున్నదని కూడా ఆమె వ్యంగ్య వ్యాఖ్యానం చేశారు. ఈ విషయాలను ప్రస్తావిస్తూ మద్రాస్ హైకోర్టుకు చెందిన 21 మంది లాయర్లు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఒక లేఖ రాశారు. న్యాయమూర్తిగా నియామకానికి గౌరి పేరును ఆమోదించరాదని రాష్ట్రపతిని కోరారు. గౌరి వెలిబుచ్చిన అభిప్రాయాలు భారత రాజ్యాంగ మౌలిక విలువలకు వ్యతిరేకమైనవని, ఆమెను న్యాయమూర్తిగా నియమించడం వల్ల న్యాయ వ్యవస్థ నిష్పాక్షికతపై ప్రజల్లో విశ్వాసం సడలి తీరుతుందని వారు అభిప్రాయపడ్డారు. దేశంలో మత కలహాలను, హింసను రెచ్చగొట్టేలా ఆమె అభిప్రాయాలు వున్నాయని న్యాయం కోరుతూ ఆమె పాల్గొనే ధర్మాసనం ముందుకు వెళ్ళడానికి మైనారిటీ మతస్థులు వెనుకాడతారని ఆ లేఖ రాష్ట్రపతికి నివేదించింది.
ఈ వ్యవహారంలో కొలీజియంను సంజాయిషీ కోరాలని రాష్ట్రపతిని అర్థించింది. ఈ వివాదం తలెత్తిన తర్వాత విక్టోరియా గౌరి ట్విటర్‌లోని తన అభిప్రాయాలను చెరిపివేయించారని వార్తలు చెబుతున్నాయి. ఇందుకు ప్రతిగా గతంలో కూడా రాజకీయ పార్టీలతో సంబంధాలు వున్న నేపథ్యం గల వారు న్యాయమూర్తి పదవులు అలంకరించారంటూ మదురైకి చెందిన 50 మంది లాయర్లు మరొక లేఖను రాష్ట్రపతికి రాశారు. అణగారిన వారి న్యాయమూర్తిగా పేరు గాంచిన మద్రాసు హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కె చంద్రు దీనిపై ఒక విలువైన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. విక్టోరియా గౌరి ఒక పార్టీ పదవిలో వుండడమే కాకుండా వ్యాసాలు, ఇంటర్వూల ద్వారా విద్వేష పూరిత ప్రకటనలు చేశారని అందుచేతనే ఆమె న్యాయమూర్తి పదవికి అనర్హురాలు అవుతారని ఆయన అన్నారు.
మామూలుగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇద్దరు సీనియర్ న్యాయమూర్తులతో సంప్రదించి న్యాయమూర్తి పదవులకు అభ్యర్థులను సిఫారసు చేస్తారు. ఆ పేర్లను గవర్నర్ కేంద్ర న్యాయశాఖకు పంపిస్తారు. ఆ శాఖ ఆ సమాచారాన్నంతా భారత ప్రధాన న్యాయమూర్తి (సిజెఐ)కి అందజేస్తుంది. దానిపై సిజెఐ ఇద్దరు సీనియర్ సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో సంప్రదించి ఆ పేర్లను నియామకానికి సిఫారసు చేస్తారు. ఇంత సుదీర్ఘమైన ప్రక్రియలో విక్టోరియా గౌరి విద్వేషపూరిత అభిప్రాయాలు, బిజెపితో ఆమెకున్న గాఢానుబంధం కొలీజియం దృష్టికి వెళ్లకుండా ఎలా దాక్కోగలిగింది అనేది ముఖ్యమైన ప్రశ్న. అన్నీ తెలిసే అన్ని స్థాయిల్లోనూ ఆమె పేరుకు ఆమోద ముద్ర లభించి వుంటే దేశంలో న్యాయమూర్తుల నియామక ప్రక్రియ నిష్పాక్షికతను పూర్తిగా కోల్పోయిందని భావించక తప్పదు. దీనిని దేశ సెక్యులర్ పునాదులకు కలగగల అనేక ప్రమాదాలకు సంకేతంగా పరిగణించవలసి వుంది.