Monday, November 18, 2024

కేంద్ర, రాష్ట్రాల మధ్య ఘర్షణ తగదు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆదేశాలు కోరుతూ రాష్ట్ర ప్రభుత్వాలు తమ వద్దకు ఇటీవలి కాలంలో తరచు వస్తున్న ఉదంతాలపై సుప్రీంకోర్టు సోమవారం ఆందోళన వ్యక్తం చేసింది. ఒకరిపై ఒకరు ఘర్షణ పడడం కన్నా పరస్పర సహకారంతో సమస్యను పరిష్కరించుకోవాలని సుప్రీంకోర్టు పిలుపునిచ్చింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఘర్షణ ఉండరాదని కరవు సహాయ నిధుల విడుదల కోరుతూ కర్నాటక ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ విచారణ సంర్భంగా సుప్రీంకోర్టు సూచించింది.అనేక జిల్లాలలో కరవు నెలకొన్న దృష్టా కర్నాటక ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందచేయలేదని పిటిషన్ పేర్కొంది.

కేంద్రం నిధులను విడుదల చేయకపోవడం తమ రాష్ట్ర ప్రజల ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని పిటిషన్‌లో కర్నాటక తెలిపింది. కరవు పరిస్థితిపై ఆరు నెలల క్రితం(గత ఏడాది అక్టోబర్) అంతర్ మంత్రివర్గ బృందం సమర్పించిన నివేదికపై కేంద్రం ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని కూడా కర్నాటక ప్రభుత్వం తెలిపింది. ఎన్‌డిఆర్‌ఎఫ్ నిధులను ఆపడం వల్ల పరిస్థితి మరింత తీవ్రరూపం దాల్చిందని తెలిపింది. నివేదికను సమర్పించిన తర్వాత నెలరోజుల్లో దానిపై చర్యలు తీసుకోవలసి ఉంటుందని కర్నాటక ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదించారు.

కాగా..లోక్‌సభ ఎన్నికలు మరో 11 రోజుల్లో జరగనున్న తరుణంలో ఈ పిటిషన్ దాఖలు చేయడాన్ని కేంద్రం తప్పుపట్టింది. సుప్రీంకోర్టును ఆశ్రయించడానికి బదులు రాష్ట్ర ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని సంప్రదించి ఉండవలసిందని కేంద్రం వాదించింది. వాద ప్రతివాదనలు విన్న జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం దీనిపై ఆదేశాలు తీసుకోవడానికి కేంద్రం తరఫున హాజరైన అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు రెండు వారాల వ్యవధిని ఇచ్చింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News