Wednesday, January 22, 2025

అణచివేత సందేశాన్ని పంపడానికే ఆకతాయిల లైంగిక హింస

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : మణిపూర్‌లో మహిళలపై చోటుచేసుకుంటున్న హింసాత్మక దాడులపై భారత సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ఓ వర్గంలో అణిచివేత సందేశాన్ని పంపేందుకు ఆకతాయిలు, మూకలు లైంగిక దాడులను ఉపయోగిస్తారని తెలిపింది. ఇటువంటి వాటికి రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకట్ట వేయాలని స్పష్టం చేసింది. బాధితుల పునరావాసం, పరిహారం చెల్లింపు, కూల్చిన గృహాలు, ప్రార్థనా మందిరాల పునరుద్ధరణ, తదితర చర్యలతోపాటు మే 4న తర్వాత మణిపూర్‌లో మహిళలపై జరిగిన లైంగిక దాడుల స్వభావం పైనా విచారణ జరపాలని ముగ్గురు మహిళా మాజీ న్యాయమూర్తులతో ఏర్పాటు చేసిన కమిటీని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది.

“ మహిళలపై లైంగిక నేరాలు, హింసాత్మక ఘటనలు, ఆమోద యోగ్యం కాదు. రాజ్యాంగం కల్పించిన వ్యక్తిగత స్వేచ్ఛ, స్వతంత్రత, గౌరవాన్ని ఇవి తీవ్రంగా ఉల్లంఘిస్తాయి’ అని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ పేర్కొన్నారు. గుంపులో ఉండటం వల్ల శిక్ష నుంచి తప్పించుకోవచ్చని భావించడంతోపాటు ఇతర కారణాల వల్ల ఆకతాయిలు మహిళలపై హింసకు పాల్పడుతుంటారు. వర్గ దాడుల సమయాల్లో , అల్లరి మూకలు ఎదుటి వర్గాలకు అణచివేత సందేశాన్ని పంపేందుకు లైంగిక హింసను వాడతారు. మహిళలపై అటువంటి దాడులు చేయడం అత్యంత దారుణం. ఇటువంటి వాటిని నివారించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే” అని చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్‌తోపాటు జస్టిస్ జెబి పార్థీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం పేర్కొంది.

ఆగస్టు 7న ఇచ్చిన ఈ తీర్పు ప్రతి తాజాగా అందుబాటు లోకి వచ్చింది. దర్యాప్తును పూర్తి చేయడానికి నిందితులు అవసరమని, పోలీస్‌లు నిందితులను త్వరితగతిన గుర్తించి అరెస్ట్ చేయడం ఎంతో కీలకమని సుప్రీం ధర్మాసనం పేర్కొంది. ఆలస్యమైతే ఆధారాలను ఆధారాలను లేకుండా చేయడం , సాక్షులను బెదిరించడం, అక్కడి నుంచి తప్పించుకు పోయే ప్రమాదం ఉందని తెలిపింది. ఇక ఇటువంటి వర్గపోరు, భారీస్థాయిలో ఆస్తి నష్టానికి దారి తీస్తుందని, వాటికి అడ్డుకట్ట వేయడం చట్టబద్ధ పాలన బాధ్యతని స్పష్టం చేసింది. ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా భరోసా కల్పించేందుకే ఇందులో జోక్యం చేసుకుంటున్నట్టు సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది.

ఇదిలా ఉంటే మణిపూర్‌లో బాధితుల పునరావాసం, పరిహారం చెల్లింపు, కూల్చిన గృహాలు, ప్రార్థనా మందిరాల పునరుద్ధరణ తదితర చర్యలను పర్యవేక్షించేందుకు ముగ్గురు హైకోర్టు మహిళా మాజీ జడ్జీలతో కూడిన కమిటీని సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కమిటీకి జమ్ముకశ్మీర్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గీతా మిత్తల్ నేతృత్వం వహిస్తుండగా, బాంబే హైకోర్టు మాజీ జడ్జి జస్టిస్ శాలినీ పి. జోషి , ఢిల్లీ హైకోర్టు మాజీ జడ్జి జస్టిస్ ఆశా మేనన్ సభ్యులుగా ఉంటారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News