సుప్రీం కోర్టు తీర్పు
న్యూఢిల్లీ : వివాహానికి అంగీకరించకపోవడం ఐపిసి 306 కింద ఆత్మహత్యకు పురికొల్పడం కిందకు రాదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. న్యాయమూర్తులు బివి నాగరత్న, సతీష్ చంద్ర శర్మతో కూడిన ధర్మాసనం ఒక మహిళపై చార్జిషీట్‌ను కొట్టివేస్తూ ఈ అభిప్రాయం వ్యక్తం చేసింది. తన కుమారునితో ప్రేమలో ఉన్నట్లుగా పేర్కొంటున్న మరొక మహిళ ఆత్మహత్యకు ఫిర్యాదీ ప్రేరేపించిందని ఆరోపించడమైంది. హతురాలిని వివాహం ఆడేందుకు నిరాకరించిన ఫిర్యాదీ కుమారునికి, ఆమెకు మధ్య వివాదాలు ప్రాతిపదికగా ఆరోపణలు వచ్చాయి.
వివాహాన్ని ఫిర్యాదీ వ్యతిరేకించిందని, హతురాలిపై నిందాత్మక వ్యాఖ్యలు చేసిందని ఆరోపించారు. చార్జిషీట్, సాక్షుల వాఙ్మూలాలు సహా అందుబాటులో ఉన్న దాఖలాలు అన్నీ సరైనవిగా భావించినా, ఫిర్యాదీపై ఇసుమంతైనా సాక్షాధారం లేదని కోర్టు పేర్కొన్నది. ‘ఐపిసి 306 సెక్షన్ కింద నేరం అవుతుందనేందుకు ఫిర్యాదీ చర్యలు యాదాలాపమైనవిగా, పరోక్షమైనవిగా మేము భావించాం. దురదృష్టవశాత్తు ఆత్మహత్యకు పాల్పడడం మినహా హతురాలికి ప్రత్యామ్నాయం లేదనేలా ఫిర్యాదీపై ఆరోపణ ఏదీ లేదు’ అని బెంచ్ పేర్కొన్నది.