న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల పంజాబ్‌ను సందర్శించిన సందర్భంగా తలెత్తిన భద్రతా వైఫల్యాలపై కేంద్రం, పంజాబ్ ప్రభుత్వాలు ఏర్పాటుచేసిన రెండు వేర్వేరు విచారణ కమిటీలపై సుప్రీంకోర్టు సోమవారం స్టే విధించింది. పంజాబ్‌లో జరిగిన ఘటనలపై దర్యాప్తునకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి సారథ్యంలో ఒక కమిటీని తామే ఏర్పాటు చేస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ కమిటీ ఏర్పాటుకు సంబంధించిన ఉత్తర్వులను త్వరలోనే జారీచేస్తామని చీఫ్ జస్టిస్ ఎన్‌వి రమణ నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది. ఈ కమిటీలో చండీగఢ్ డిజిపి, ఎన్‌ఐఎ ఐజి, పంజాబ్ హర్యానా హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఉంటారని ధర్మాసనం తెలిపింది.
పంజాబ్‌లో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన సందర్భంగా ఏర్పడిన భద్రతా వైఫల్యాలపై సమగ్రంగా దర్యాప్తు జరగాలని, భవిష్యత్తులో ఇటువంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతూ లాయర్స్ వాయిస్ అనే సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌పై ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. ఈ నెల 5వ తేదీ ప్రధాని మోడీ పంజాబ్‌ను సందర్శించినపుడు ఫిరోజ్‌పూర్ వద్ద నిరసనకారులు రోడ్లను అడ్డగించడంతో ప్రధాని కాన్వాయ్ ఒక ఫ్లైఓవర్‌పై దాదాపు 20 నిమిషాల పాటు నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఈ కారణంగా ప్రధాని మోడీ తాను పాల్గొనవలసి ఉన్న ర్యాలీతోసహా ఇతర కార్యక్రమాలను రద్దు చేసుకుని విమానాశ్రయానికి వాపసు వెళ్లిపోవలసి వచ్చింది.