Friday, December 20, 2024

చీతాల మరణాలపై సుప్రీం ఆందోళన

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : విదేశాల నుంచి తీసుకొచ్చిన చీతాలు మరణిస్తుండడంపై సుప్రీం కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. వాటిలో 40 శాతం చీతాలు మృత్యువాత పడ్డాయని,ఇది మంచి సంకేతం కాదని సుప్రీం కోర్టు గురువారం వ్యాఖ్యానించింది. పరువు ప్రతిష్ఠలకు పోకుండా వేరే చోటికి వాటిని తరలించే ప్రయత్నాలు వీలైనంతవరకు చేయాలని సూచించింది జస్టిస్‌లు బిఆర్ గవాయి, జెబి పర్డీవాలా, ప్రశాంతకుమార్ మిశ్రా, లతో కూడిన ధర్మాసనం చీతాల మరణాలపై దాఖలైన పిటిషన్‌పై గురువారం విచారణ చేపట్టింది. ప్రాజెక్టు చీతా ప్రారంభదశలో జాతీయ పులుల సంరక్షణ సంస్థకు మార్గదర్శం చేయాలంటూ కేంద్రం నియమించిన నిపుణుల సంఘం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం విచారణ చేపట్టగా నిపుణుల కమిటీ తరఫున సీనియర్ న్యాయవాది ప్రశాంత్ చంద్రసేన్ వాదనలు వినిపించారు.

కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి వాదనలు వినిపించారు. ప్రాజెక్టు చేపట్టక ముందే చీతాల మరణం గురించి కేంద్రం చర్చించిందని, వాతావరణ పరిస్థితుల కారణంగా కొన్ని చీతాలు మృత్యువాత పడ్డాయని ముందుగానే ఊహించిందని కోర్టుకు తెలిపారు. 40 చీతాలు మరణించినా ఎందుకు నివారణ చర్యలు చేపట్టలేదని కేంద్రాన్ని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. వాటిని వేరే చోటికి తరలించే మార్గాలను పరిశీలించాలని సూచించింది. మరోవైపు ప్రాజెక్టు చీతా పూర్తి వివరాలను నిపుణుల కమిటీకి అందజేయాలని , కమిటీ చేసిన సూచనలు, సలహాలను పరిగణన లోకి తీసుకునేలా కేంద్రాన్ని ఆదేశించాలని ప్రశాంత్ చంద్రసేన్ న్యాయస్థానాన్ని కోరారు. వాదనలు విన్న ధర్మాసనం చీతాల మరణాల కారణాలపై పూర్తి వివరాలను న్యాయస్థానానికి సమర్పించాలని కేంద్రాన్ని ఆదేశించింది. తదుపరి విచారణ ఆగస్టు 1 కి వాయిదా వేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News