Monday, January 13, 2025

‘మహా’ స్పీకర్‌కు మందలింపు

- Advertisement -
- Advertisement -

ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే సహా 56 మంది శివసేన ఎంఎల్‌ఎల అనర్హత పిటిషన్లపై ఎటూ తేల్చకుండా వల్లమాలిన జాప్యం చేస్తున్నందుకు మహారాష్ట్ర స్పీకర్‌ను సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుపట్టడం ఇటువంటి వివాదాలకు వెంటనే తెరపడే అవకాశాలను కలిగిస్తే హర్షించవలసిందే. ఫిరాయింపులను నిషేధిస్తున్న రాజ్యాంగం 10వ షెడ్యూల్ కేసుల పరిష్కారంలో స్పీకర్లు ఆలస్యం చేయడానికి వీలులేదని అత్యున్నత న్యాయస్థానం వెలిబుచ్చిన అభిప్రాయం తిరుగులేనిది. ఫిరాయింపుల ద్వారా అధికార కైవసానికి పాల్పడిన ఉదంతాల్లో చట్టానికి అనుగుణంగా వ్యవహరించకపోతే వారిని శాసన సభ్యత్వాలకు అనర్హులను చేసే అధికారం స్పీకర్‌కు వుంది. కాని స్పీకర్ కూడా పాలక వ్యవస్థలో భాగం అయిపోతున్నందున ఈ పిటిషన్లను వారు నిరవధికంగా బుట్టదాఖలా చేస్తున్న సంగతీ కాదనలేని చేదు వాస్తవమే. అందుచేత ఈ పిటిషన్లు శాశ్వతంగా పరిష్కారానికి నోచుకోడం లేదు. మహారాష్ట్ర విషయంలో సుప్రీంకోర్టు ఇప్పుడు చూపిన ఈ చొరవతోనైనా ఈ వ్యవహారం ఒక కొలిక్కి వస్తుందేమో చూడాలి.

2019లో జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన బిజెపి, శివసేన ఉమ్మడిగా మెజారిటీ స్థానాలు గెలుచుకొన్నాయి. కాని వంతులవారీ ముఖ్యమంత్రి పదవిని ముందుగా తనకే ఇవ్వాలని శివసేన పట్టుబట్టడంతో ఆ రెండు పార్టీల మధ్య తలెత్తిన విభేదాలు ముదిరి అది బిజెపితో తెగతెంపులు చేసుకొన్నది. దానితో ఎన్‌సిపి, కాంగ్రెస్‌ల మహాఅఘాదీ కూటమిలో శివసేన చేరింది. ఆ మూడు పార్టీల మహా వికాస్ అఘాదీ కూటమి శాసన సభలో మెజారిటీని సాధించుకోడంతో అది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. విరుద్ధ సిద్ధాంతాలు కలిగిన శివసేనతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ద్వారా ఎన్‌సిపి, కాంగ్రెస్‌లు ఒక కొత్త ప్రయోగాన్ని ఆవిష్కరించాయి. ఉద్ధవ్ థాక్రే ముఖ్యమంత్రిగా ఏర్పాటైన ఈ ప్రభుత్వం విజయవంతంగా మూడు సంవత్సరాలు సాగిన తర్వాత 2022 జూన్‌లో ఏక్‌నాథ్ షిండే నాయకత్వంలో 11 మంది శివసేన ఎంఎల్‌ఎలు బిజెపి పాలనలోని గుజరాత్‌లో గల సూరత్‌కు చేరుకొని మిగతా మరి కొంత మంది సేన శాసన సభ్యులను అక్కడికి రప్పించుకొన్నారు.

ఆ తర్వాత బిజెపి పాలనలోనే గల అసోంకు మకాం మార్చి మొత్తం 40 మంది శాసన సభ్యులు తమతో వున్నారని బిజెపి కి గల 150 మందితో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సిద్ధంగా వున్నామని ఏక్‌నాథ్ షిండే ప్రకటించడం, పర్యవసానంగా ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వం కూలిపోడం జరిగిపోయాయి. ఆ తర్వాత ఏక్‌నాథ్ షిండే ముఖ్యమంత్రిగా చేస్తూ బిజెపి షిండే శివసేన కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఈ సమయంలో ముందుగా 16 మంది షిండే వర్గ శాసన సభ్యులపై ఫిరాయింపుల అనర్హత వేటు వేయాలని ఉద్ధవ్ థాక్రే వర్గం దరఖాస్తు చేసుకొన్నది. ఇందుకు ప్రతిగా ఉద్ధవ్ వర్గానికి చెందిన శాసన సభ్యులు కొంత మందిని అనర్హులను చేయాలని కోరుతూ షిండే వర్గం అర్జీ పెట్టుకొన్నది. ఆ విధంగా మొత్తం 56 మంది శివసేన శాసన సభ్యులపై అనర్హత పిటిషన్లు అపరిష్కృతంగా వున్నాయి. వీటిపై చట్టప్రకారం నిర్ణయం తీసుకొంటే షిండే వర్గం శాసన సభ్యులు అనేక మందిపై అనర్హత వేటు వేయవలసి రావచ్చు. అది ఆ ప్రభుత్వం కూలిపోయే పరిస్థితిని కలిగిస్తుంది. అందుచేత స్పీకర్ రాహుల్ నర్వేకర్ నిర్ణయాన్ని వాయిదా వేస్తూ వస్తున్నారు. సుప్రీంకోర్టు దీనిని తప్పుపట్టడంతో ఈ వ్యవహారంపై ఆయన ఏదో ఒక నిర్ణయం తీసుకోక తప్పక పరిస్థితి తలెత్తింది.

ఈ నేపథ్యంలో నర్వేకర్ మొన్న గురువారం నాడు న్యూఢిల్లీ చేరుకోడం వివాదాస్పదమైంది. ఎంఎల్‌ఎల అనర్హత పిటిషన్లపై వాస్తవ పరిస్థితిని తనకు తెలియజేయాల్సిందిగా సుప్రీంకోర్టు ఆదేశించిన తర్వాత ఆయన ఢిల్లీ వెళ్ళడం వెనుక న్యాయ సలహా తీసుకోవాలన్న తాపత్రయమే వున్నదని పరిశీలకులు భావిస్తున్నారు. ఈ విషయమై ప్రశ్నించగా ముందే తీసుకొన్న నిర్ణయం మేరకే తాను ఢిల్లీ వచ్చానని ఆయన చెప్పారు. అలాగే అనర్హత పిటిషన్లపై విచారణ ప్రారంభించాలని సుప్రీంకోర్టు తనను ఆదేశించిన మాట వాస్తవమని, అయితే దానిని ఆదరాబాదరాగా చేపట్టడం కూడా మంచిది కాదని, సరైన సమయంలో నిర్ణయం తీసుకోవలసి వుందని నర్వేకర్ వివరించారు. తొందర పాటు తీర్పు ఇవ్వడం వల్ల న్యాయం జరగబోదని కూడా అన్నారు. ఫిరాయింపుల చట్టం కింద ఎంఎల్‌ఎలపై దాఖలయ్యే అనర్హత పిటిషన్లను బుట్టదాఖలా చేయడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించడం ఒక మంచి పరిణామం. మహారాష్ట్ర వ్యవహారంలో వెలువడే అంతిమ నిర్ణయం ఇతర రాష్ట్రాల్లో తలెత్తే ఇటువంటి సందర్భాల్లో స్పీకర్లు పాటించవలసిన విధి విధానాల అవతరణకు దోహదం చేస్తే అది ఒక మంచి పరిణామం అవుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News