Sunday, December 22, 2024

దీదీ సర్కారుకు సుప్రీం సూచన

- Advertisement -
- Advertisement -

ప్రజల నమ్మకాన్ని కోల్పోతే ఇంకేం మిగలదు:

న్యూఢిల్లీ : పశ్చిమబెంగాల్ రాజకీయాలను కుదిపేసిన ఉపాధ్యాయ నియామక కుంభకోణం వ్యవహారంపై సుప్రీం కోర్టు మంగళవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా బెంగాల్ ప్రభుత్వానికి కఠిన ప్రశ్నలు సంధించింది. ఎంపిక ప్రక్రియ అంశం కోర్టులో ఉండగానే కొత్త పోస్ట్‌లు సృష్టించి నియామకాలు ఎలా చేపట్టారని ప్రశ్నించింది. వ్యవస్థపై ప్రజలు నమ్మకాన్ని కోల్పోతే ఆ పరిస్థితిని ఎలా ఎదుర్కొంటారని ఆగ్రహించింది.

బెంగాల్‌లో 2016 నాటి స్టేట్ లెవల్ సెలక్షన్ టెస్ట్ నియామక ప్రక్రియ చెల్లదని ఇటీవల కలకత్తా హైకోర్టు కీలక తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఈ క్రమం లోనే 25, 743 మంది టీచర్లు , నాన్‌టీచింగ్ సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున పలు పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వం లోని ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా దీదీ సర్కారు తీరుపై అసహనం వ్యక్తం చేసింది.

“ ఇది వ్యవస్థీకృత మోసమే. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఇలాంటి సమయంలో ప్రభుత్వ ఉద్యోగుల నియామకాల్లో అవతవకలు జరిగితే , వ్యవస్థలో ఇంకేం మిగులుతుంది ? వ్యవస్థపై ప్రజలు విశ్వాసాన్ని కోల్పోతే దాన్ని మీరు ఎలా ఎదుర్కొంటారు? ప్రజల నమ్మకం పోతే ఇంకేం మిగలదు” అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ సందర్భంగా నియామక ప్రక్రియకు సంబంధించిన డేటాను ఎందుకు భద్రపర్చలేదంటూ రాష్ట ప్రభుత్వాన్ని నిలదీసింది. .“ ఆ డేటా ఉందా లేదా ? నియామక ప్రక్రియకు సంబంధించిన అన్ని పత్రాలను డిజిటల్ రూపంలో భద్ర పర్చడం స్కూల్ సర్వీస్ కమిషన్ బాధ్యత ” అని గుర్తు చేసింది.

ప్రభుత్వ ప్రాయోజిత , ఎయిడెడ్ పాఠశాలల్లో 9 నుంచి 12 తరగతులకు ఉపాధ్యాయులతోపాటు గ్రూప్ సి, గ్రూప్ డి స్టాఫ్ సిబ్బంది నియామకాల కోసం 2016లో బెంగాల్ సర్కారు రాష్ట్రస్థాయి సెలక్షన్ పరీక్ష నిర్వహించింది. 24,650 ఖాళీల భర్తీ కోసం చేపట్టిన రిక్రూట్ మెంట్ పరీక్షకు 23 లక్షల మందికి పైగా హాజరయ్యారు. ఇందులో అవకతవకలు జరిగినట్టు అప్పట్లోనే ఆరోపణలు రాగా, ఈ వ్యవహారం కోర్టుకు చేరింది. ఆ అంశం పెండింగ్‌లో ఉండగానే అందులో ఎంపిక ప్రక్రియను చేపట్టి 25,753 మందికి అపాయింట్‌మెంట్ లెటర్లు అందజేశారు. ఖాళీల కంటే అదనంగా కొంతమందిని నియమించడంపై వివాదాస్పదమైంది. ఈ క్రమం లోనే నాటి నియామక ప్రక్రియను రద్దు చేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News