ముంబై మెట్రోకు సుప్రీం ఆదేశం
న్యూఢిల్లీ: ముంబైలోని ఆరీ కాలనీలో చెట్లను నరకబోమని ఇచ్చిన హామీకి కచ్ఛితంగా కట్టుబడి ఉండాలని, ఈ విషయంలో ఎటువంటి ఉల్లంఘనలు జరిగినా కఠిన చర్యలు ఎదుర్కోవలసి వస్తుందని ముంబై మెట్రో రైల్ కార్పొరేషన్(ఎంఎంఆర్‌సిఎల్)ను సుప్రీంకోర్టు బుధవారం హెచ్చరించింది. చెట్లను ఏ రకంగాను నరకబోమని హామీ ఇస్తూ ఎంఎంఆర్‌సిఎల్ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిందని జస్టిస్ యుయు లలిత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం బుధవారం విచారణ సందర్భంగా తెలిపింది. ఆరీ కాలనీల 2019 అక్టోబర్ తర్వాత ఒక్క చెట్టును కూడా నరకలేదని ఎంఎంఆర్‌సిఎల్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలియచేశారు. కాగా..పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది అనితా షెనాయ్ వాదనలు వినిపిస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ నేలను చదునుచేసే కార్యక్రమం కొనసాగుతోందని తెలిపారు. కాగా..మహారాష్ట్ర ప్రభుత్వ తరఫు న్యాయవాది తన వాదనలు వినిపించడానికి కొంత సమయం కోరడంతో ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల 30వ తేదీకి కోర్టు వాయిదా వేసింది.