న్యూఢిల్లీ: ఉత్తర్ ప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీలో 2000 సంవత్సరంలో జరిగిన ఒక 24 ఏళ్ల యువకుడి హత్య కేసులో నిర్దోషిగా తాను విడుదల కావడాన్ని సవాలు చేస్తూ యుపి ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీలును బదిలీ చేయాలని అర్థిస్తూ కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు బుధవారం తోసిపుచ్చింది. తన తరఫున వాదిస్తున్న సీనియర్ న్యాయవాది అలహాబాద్‌లో ఉంటారని, వృద్ధాప్యం కారణంగా ఆయన కేసును వాదించడానికి లక్నోకు రావడం సాధ్యం కాదని, ఈ కారణంగా ఈ కేసును అలహాబాద్‌కు బదిలీ చేయాలని కోరుతూ అజయ్ మిశ్రా దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన చీఫ్ జస్టిస్ యుయు లలిత్, జస్టిస్ బేలా ఎం త్రివేది నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం దీన్ని తోసిపుచ్చింది. వచ్చే నవంబర్ 10న యుపి ప్రభుత్వ అప్పీలుపై హైకోర్టు విచారణకు ఉభయ పక్షాల న్యాయవాదులు అంగీకరించారని ధర్మాసనం పేర్కొంది. సీనియర్ న్యాయవాది లక్నోకు రావడం సాధ్యం కాకపోతే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన తన వాదనలు వినిపించాలని అర్థిస్తే దీన్ని హైకోర్టు అంగీకరించవచ్చని ధర్మాసనం తెలిపింది. లఖింపూర్ ఖేరిలో 24 ఏళ్ల ప్రభాత్ గుప్తా హత్య కేసులో ముద్దాయిగా ఉన్న అజయ్ మిశ్రాను 2004లో నిర్దోషిగా కోర్టు విడుదల చేసింది. కాగా.. దీన్ని సవాలు చేస్తూ యుపి ప్రభుత్వం హైకోర్టులో అప్పీలు చేసుకుంది.
అజయ్ మిశ్రా పిటిషన్‌ను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు
- Advertisement -
- Advertisement -
- Advertisement -