Thursday, December 19, 2024

లొంగిపోయి జైలుకు వెళ్లాల్సిందే

- Advertisement -
- Advertisement -

బిల్కిస్ బానో కేసులో దోషులకు సుప్రీం ఆదేశం

న్యూఢిల్లీ: గుజరాత్‌లో 2002లో జరిగిన అల్లర్ల సందర్భంగా బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారం జరిపి ఆమె కుటుంబ సభ్యులు ఏడుగురిని హత్యచేసిన కేసులో కారాగార శిక్ష పడిన 11 మంది డోషులు లొంగిపోవడానికి తమకు కొంత వ్యవధి కావాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టివేసింది. దోషలు లొంగుబాటు వాయిదాకు చూపుతున్న కారణాలు హేతుబద్ధంగా లేవని జస్టిస్ ఎన్‌వి నాగరత్న నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది.

జైలు శిక్షను అనుభవిస్తున్న బిల్కిస్ బానో కేసులోని ఖైదీలకు గుజరాత్ ప్రభుత్వం క్షమాభిక్షను ప్రసాదిస్తూ జారీచేసిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు జనవరి 8న కొట్టివేసింది. రెండు వారాలలో సంబంధిత అధికారుల ఎదుట ఖైదీలు లొంగిపోవాలని కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది. తమ లొంగుబాటుకు సమయం కావాలని కోరుతూ వారు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ఇప్పుడు కొట్టివేయడంతో ఈ కేసులోని 11 మంది దోషులు జనవరి 22లోగా జైలు అధికారుల ఎదుట లొంగిపోవలసి ఉంటుంది.

అనారోగ్య కారణాలు, సర్జరీ ఉందంటూ, కుమారుడి వివాహమంటూ, పంటల సీజన్ అంటూ వేర్వేరు కారణాలు చెబుతూ దోషులు లొంగిపోవడానికి సమయాన్ని కోరారు. 15 ఏళ్ల జైలు శిక్షను అనుభవించడంతోపాటు వయసు, సత్ప్రవర్తనను దృష్టిలో పెట్టుకుని గుజరాత్ ప్రభుత్వం వారికి క్షమాభిక్ష ప్రసాదించగా గత ఏడాది ఆగస్టు 15న వారు జైలు నుంచి విడుదలయ్యారు. ఈ కేసులో 11 మంది దోషులను శిక్షాకాలం పూర్తి కాకముందే విడుదల చేస్తూ జారీచేసిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు జనవరి 8న కొట్టివేసింది.

వారికి క్షమాభిక్ష ప్రసాదించే హక్కు గుజరాత్ ప్రభుత్వానికి లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. బిల్కిస్ బానో కేసు విచారణ మహారాష్ట్రలో జరిగినందున దోషులకు క్షమాభిక్ష ప్రసాదించే హక్కు మహారాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే ఉందని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. మహారాష్ట్ర ప్రభుత్వం అధికారాలను గుజరాత్ ప్రభుత్వం చేజిక్కించుకోవడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. గుజరాత్‌లోని గోద్రాలో బర్మతి ఎక్స్‌ప్రెస్ రైలుపై దాడి జరిగి 59 మంది కరసేవకులు సజీవదహనం చెందిన దరిమిలా రాష్ట్రంలో అల్లర్లు చెలరేగి 2002 మార్చి 3న దహోద్‌లో గర్భిణిగా ఉన్న బిల్కిస్ బానోపై మూకలు దాడి జరిపి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతేగాక ఆమె మూడేళ్ల కుమార్తె సలేహాతోపాటు మరో 13 మందిని హత్యచేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News