న్యూఢిల్లీ: వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జాతీయస్థాయి పరీక్ష నీట్(యుజి)ని రద్దు చేసి, తిరిగి నిర్వహించేలా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. సెప్టెంబర్ 12న నిర్వహించిన నీట్ పరీక్ష సందర్భంగా వాట్సాప్ ద్వారా పేపర్లు లీకయ్యాయని పిటిషన్‌లో పేర్కొన్నారు. పరీక్షకు అభ్యర్థుల తరఫున ఇతరులు హాజరైన ఘటనలూ జరిగాయని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆ ఘటనలపై సిబిఐ మూడు ఎఫ్‌ఐఆర్‌లు కూడా నమోదు చేసిందని గుర్తు చేశారు. దీనిపై జస్టిస్ ఎల్. నాగేశ్వరరావు, జస్టిస్ బిఆర్ గవాయి ధర్మాసనం విచారణ జరిపింది. ఏడున్నర లక్షలమంది విద్యార్థులు హాజరైన పరీక్షను, ఐదు ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా రద్దు చేయాలని కోరడం సరైంది కాదని ధర్మాసనం తెలిపింది. ఇలాంటి పిటిషన్లతో కోర్టు సమయాన్ని వృథా చేయొద్దని పిటిషన్‌దారు తరఫు న్యాయవాదిని హైచ్చరించింది. మొదట రూ.5 లక్షల జరిమానా విధిస్తామని తెలిపిన ధర్మాసనం, ఆ తర్వాత ఈసారికి వదిలేస్తున్నామంటూ హెచ్చరికతో సరిపెట్టింది.