న్యూఢిల్లీ : శ్రీరామ నవమి , హనుమాన్ జయంతి సందర్భంగా ఢిల్లీ సహా అనేక ప్రాంతాల్లో చోటు చేసుకున్న మత ఘర్షణలపై దర్యాప్తు చేసేందుకు జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టి పారేసింది. మాజీ సీజేఐలు ఎవరూ ఖాళీగా లేరంటూ పిటిషనర్‌పై అసహనం వ్యక్తం చేసింది. ఇటీవల హనుమాన్ జయంతి సందర్భంగా ఢిల్లీలోని జహంగీర్‌పురిలో చేపట్టిన శోభాయాత్ర ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. రెండు వర్గాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఓ వ్యక్తి తుపాకీతో కాల్పులకు పాల్పడిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఘర్షణలో పోలీసులు సహా పలువురు పౌరులు గాయపడ్డారు.
ఈ ఘటన కంటే కొద్ది రోజుల ముందు శ్రీరామ నవమి సందర్భంగా గుజరాత్, మధ్యప్రదేశ్,ఝార్ఖండ్, రాజస్థాన్, బెంగాల్ రాష్ట్రాల్లో మత ఘర్షణలు చెలరేగాయి. వీటిపై దర్యాప్తు చేపట్టేలా ఆదేశాలివ్వాలని కోరుతూ విశాల్ తివారీ అనే న్యాయవాది సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ అల్లర్లపై దర్యాప్తుకు మాజీ సీజేఐ నేతృత్వం లోని జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేయాలని కోరారు. దీనిపై విచారణ జరిపిన లావు నాగేశ్వరరావు , జస్టిస్ బీఆర్ గవాయ్‌లతో కూడిన ధర్మాసనం , పిటిషన్ దారుపై అసహనం వ్యక్తం చేసింది. మాజీ సీజేఐ నేతృత్వంలో దర్యాప్తు జరిపించాలని మీరు కోరుతున్నారా ? ఇక్కడ ఎవరైనా ఖాళీగా ఉన్నారా? ఇలాంటివి అభ్యర్థించకండి. ఈ పిటిషన్‌ను కొట్టివేస్తున్నాంఅని ధర్మాసనం స్పష్టం చేసింది.