న్యూఢిల్లీ : పాకిస్థాన్ నటీనటులు, సాంకేతిక సిబ్బంది భారతీయ సినిమాల్లో పనిచేయకుండా నిషేధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు మంగళవారం కొట్టివేసింది. ముంబైకి చెందిన ఫైజ్ అన్వర్ ఖురేషి అనే సినీ కళాకారుడు బాంబే హైకోర్టులో గతంలో ఈ పిటిషన్ దాఖలు చేశాడు. పాక్ కళాకారులకు భారతీయ సినిమాల్లో అవకాశాలు ఇవ్వడంతో భారత చిత్ర పరిశ్రమకు చెందిన కళాకారులు అవకాశాలు కోల్పోతున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు.
దీనిపై విచారణ జరిపిన బాంబే హైకోర్టు కేంద్రానికి అలాంటి ఆదేశాలు ఇవ్వలేమని తీర్పు చెప్పింది. బాంబే హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ పిటిషనర్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. మంగళవారం దీనిపై జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్‌వీఎన్ భట్టిలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. బాంబే హైకోర్టు తీర్పును సమర్ధించింది. ఫైజ్ అన్వర్ ఖురేషి పిటిషన్‌ను కొట్టి వేసింది.
ఇంఫాల్‌లో మళ్లీ విధుల్లోకి పాత్రికేయులు
కోల్‌కతా : తీవ్రవాద గ్రూపుల జోక్యానికి నిరసనగా ఇంఫాల్ వేలీలో శుక్రవారం నుంచి విధులు బహిష్కరించిన పాత్రికేయులు, టివి ఛానల్స్ ప్రతినిధులు మంగళవారం నుంచి తమ విధులు ప్రారంభించారు. ఆల్ మణిపూర్ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్, ఎడిటర్ల గిల్డ్ ఈమేరకు మంగళవారం ప్రకటన విడుదల చేసింది. మీడియా సంస్థల సాధారణ కార్యవర్గ సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటనలో పేర్కొన్నారు. పాత్రికేయులు విధులు బహిష్కరించే సమాచారాన్ని ముఖ్యమంత్రి శనివారం తెలుసుకున్నారు. దీనిపై సిఐడి నుంచి నివేదిక కోరారు. తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.