Friday, December 20, 2024

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కమిటీని రద్దు చేసిన సుప్రీం కోర్టు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సిఎ) కమిటీని సుప్రీం కోర్టు రద్దు చేసింది. ప్రస్తుత కమిటీ స్థానంలో మాజీ జడ్జి జస్టిస్ లావు నాగేశ్వరరావుతో ఏకసభ్య కమిటీని నియమించింది. ఇకపై హెచ్‌సిఎ వ్యవహారాలు కొత్త కమిటీ చూసుకుంటుందని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. హెచ్‌సిఎ ఎన్నికల ప్రక్రియకు సబంధించి దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. జస్టిస్ లావు నాగేశ్వరరావు నేతృత్వంలో హెచ్‌సిఎ ఎన్నికలు నిర్వహించాలని సీనియర్ న్యాయవాది సిద్దార్థ దవే కోర్టును కోరారు. హెచ్‌సిఎలో అసలైన ఓటర్లను ఆయన ఎంపిక చేయగలుగుతారని పేర్కొన్నారు. జస్టిస్ లావు నాగేశ్వరరావు గతంలో ఇండియన్ ఓలింపిక్ అసోసియేషన్ (ఐఓఎ) కోసం ఎలక్టోరల్ కాలేజీని ఖరారు చేసే ప్రక్రియను పర్యవేక్షించారని ఇప్పటికే ఐఓఎ ముసాయిదా రాజ్యాంగాన్ని పర్యవేక్షిస్తున్నారని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. జస్టిస్ లావు నాగేశ్వరరావు కమిటి నివేదిక ప్రకారం తదుపరి ఆదేశాలు జారీ చేస్తామని న్యాయస్థానం తెలిపింది.

గత కొంత కాలంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అనేక వివాదాల్లో చిక్కుకుంది. హెచ్‌సిఎ వ్యవహారాలు అస్తవ్యస్తంగా మారాయి. పాలకవర్గంలో లుకలుకలు, ఆర్థిక అవకతవకలు, మ్యాచ్‌ల నిర్వహణలో అక్రమాలు, అవినీతి ఇలా అనేక అంశాలకు హెచ్‌సిఎ వేదికయ్యింది. ఒకప్పుడు అజహరుద్దీన్, ఎంఎల్ జయసింహ, వివిఎస్ లక్ష్మణ్, వెంకటపతిరాజు వంటి ప్రఖ్యాత క్రికెటర్లు అందించిన హైదరాబాద్ అసోసియేషన్ అంతర్గత కుమ్ములాటలతో క్రికెట్ వ్యవహారాలను పక్కనపెట్టిందన్న విమర్శలు ఎదుర్కొంటోంది. జట్టు ఎంపికలోనూ రాజకీయాలు చోటుచేసుకుంటున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. హెచ్‌సిఎలో రెండు గ్రూపుల ఆధిపత్య పోరు గత కొంత కాలంగా కొనసాగుతోంది. అజహరుద్దీన్ కమిటి గడువు సెప్టెంబర్ 25, 2022తో ముగిసింది. నిబంధనల ప్రకారం తిరిగి ఎన్నికలు నిర్వహించి కొత్త కమిటీ ఏర్పడే వరకు హెచ్‌సిఎ అధ్యక్షుడిగా ఆయనే కొనసాగుతారు. తాజాగా కమిటీని రద్దు చేస్తూ సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News