రాజకీయాలు కలుషితమై, దేశాన్ని ప్రగతి పథంలో పరుగులు పెట్టించవలసిన వ్యవస్థలన్నీ ఒకటొకటిగా అవినీతిమయమవుతున్న తరుణంలో సర్వోన్నత న్యాయస్థానం తాజాగా ఇచ్చిన తీర్పు సగటు మనిషికి ఎంతో ఊరటనిచ్చేదిగా ఉందనడంలో సందేహం లేదు. చట్టసభల్లో అవినీతికి పాల్పడిన ప్రజాప్రతినిధులకు చట్టపరంగా ఎలాంటి రక్షణ లభించదంటూ ఏడుగురు సభ్యుల ధర్మాసనం ముక్తకంఠంతో వెలువరించిన తీర్పు, అవినీతితో పేట్రేగిపోతున్న రాజకీయాసురులకు చెంపపెట్టు. చట్టసభల్లో ప్రశ్నలు అడిగేందుకు, ప్రసంగాలు చేసేందుకు, ఓట్లు వేసేందుకు లంచం తీసుకుంటే న్యాయస్థానాలు రక్షణ కల్పించబోవంటూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ నాయకత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం తేల్చి చెప్పింది. ఈ సందర్భంగా పివి నరసింహారావు వర్సెస్ సిబిఐ కేసులో ప్రజాప్రతినిధులకు లంచం కేసులో విచారణ నుంచి మినహాయింపునిస్తూ 1998లో అప్పటి ధర్మాసనం ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. రాజకీయాలు నేరమయమవుతున్నాయని, చట్టసభల్లోకి నేరచరితులు ప్రవేశిస్తున్నారని మేధావి వర్గాలు ఎంతో కాలంగా గగ్గోలు పెడుతున్నాయి. హత్యానేరాలలో అభియోగాలు ఎదుర్కొంటున్నవారు కూడా ప్రజాక్షేత్రంలో గెలిచి నిస్సిగ్గుగా చట్టసభల్లోకి అడుగుపెడుతున్నారు.
ఇటీవలి కాలంలో చట్టసభ సభ్యుల వ్యవహార శైలి తరచూ వివాదాస్పదమై, పత్రికల పతాక శీర్షికలకు ఎక్కుతోంది. పార్లమెంటులో ప్రశ్నలు లేవనెత్తేందుకు లంచం తీసుకున్నారనే అభియోగంపై లోక్‌సభ నుంచి బహిష్కరణకు గురైన తృణమూల్ కాంగ్రెస్ మాజీ ఎంపి మహువా మొయిత్రా కేసు ఇందుకు తాజా ఉదాహరణ. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో ఓ రైలు ప్రమాదం జరిగితే అప్పటి రైల్వే మంత్రిగా ఉన్న లాల్ బహదూర్ శాస్త్రి అందుకు బాధ్యతగా రాజీనామా చేసి, నైతికతకు నిలువుటద్దంలా నిలబడ్డారు. అలాంటి పార్లమెంటులో ఇప్పటి కొందరు సభ్యుల తీరుతెన్నులు, వారిపై వినవస్తున్న ఆరోపణలు చూస్తుంటే ఆనాటి కట్టుబాట్లు, నైతిక విలువలు ఏమైపోయాయని అనిపించకమానదు. నేరం నిర్ధారణై, రెండేళ్లకు మించి శిక్షపడినవారు ఆరేళ్లపాటు ఎన్నికల్లో పోటీకి అనర్హులంటూ ప్రజాప్రాతినిధ్య చట్టానికి ప్రాణం పోసిన సర్వోన్నత న్యాయస్థానం, క్రిమినల్ కేసులున్న నేతలను కట్టడి చేసేందుకూ తన వంతుగా కృషి చేస్తోంది. ఈ దిశగా కొన్ని మాసాల కిందట హైకోర్టులకు కీలకమైన మార్గదర్శకాలను జారీ చేసింది. ప్రజాప్రతినిధులపై పెండింగ్ లో ఉన్న క్రిమినల్ కేసులపై ప్రత్యేక బెంచ్‌లు ఏర్పాటు చేసి సత్వరమే విచారణ చేపట్టాలని, కేసుల వివరాలను హైకోర్టు వెబ్‌సైట్‌లో పొందుపరచాలని ఆదేశించింది.
కేసుల పరిష్కారంలో అలవిమాలిన జాప్యమే నేతల ఆగడాలకు ఊపిరి పోస్తోందనడంలో సందేహం లేదు. సర్వోన్నత న్యాయస్థానం మార్గదర్శకాలు సాకారమైతే, నాయకుల అవినీతి బాగోతాలకు కొంతవరకైనా ముకుతాడు పడే అవకాశం ఉంటుంది. తాము ఓటు వేసి గెలిపించిన నాయకుడు తమకు ఆదర్శవంతంగా ఉండాలని సగటు ప్రజానీకం ఆశించడంలో తప్పులేదు. కానీ, వాస్తవ జీవితంలో ప్రజల ఆశ అడియాసగా మారుతోందనడానికి ఉదాహరణలు బోలెడు. ప్రజాసేవ పేరిట రాజకీయాల్లోకి వచ్చేవారు.. ఎంఎల్‌ఎగానో, ఎంపిగానో గెలవగానే తమకు ఎక్కడలేని అధికారాలూ దఖలు పడ్డాయని భావించడం, తమను ఎన్నుకున్న ప్రజలపైనే అధికార దర్పం చూపించడం చూస్తూనే ఉన్నాం. ‘పంచాయతీల నుంచి పార్లమెంటు వరకూ ఎన్నికవుతున్నకొందరు ప్రజాప్రతినిధుల వ్యవహారశైలి ఏమాత్రం బాగోలేదు. అనాగరిక భాషను వాడుతూ చట్టసభల ఔన్నత్యాన్ని దిగజారుస్తున్నారు’ అంటూ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఒక సందర్భంలో అన్న మాటలు అక్షరసత్యాలు. చట్టసభలు సజావుగా సాగాలంటే రాజకీయపార్టీలు తమ సభ్యులకు స్వచ్ఛంద నియమావళిని రూపొందించాలని సూచించారాయన. గతంలో రాజ్యసభకు చైర్మన్ గా వ్యవహరించిన వెంకయ్య సలహా విలువైనది, ఆచరణీయమైనది.
పార్లమెంటు ఔన్నత్యం, అధికారం, స్వేచ్ఛను కాపాడేందుకు, సభ్యుల అనైతిక వర్తనను అరికట్టేందుకు పార్లమెంటు ఉభయ సభల్లో ఏర్పడిన ఎథిక్స్ కమిటీలు మరింత క్రియాశీలక పాత్ర పోషించవలసిన అవసరాన్ని సుప్రీంకోర్టు తాజా తీర్పు నొక్కి చెబుతోంది. ఎంపిలు లంచాలు తీసుకోవడం భారత పార్లమెంటరీ వ్యవస్థను నాశనం చేస్తోందంటూ సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్య.. పటుతరమైన చట్టాలకు రూపకల్పన చేసి, పదుగురికీ ఆదర్శవంతంగా నిలబడవలసిన చట్టసభ్యుల బాధ్యతా రాహిత్యాన్ని ఎత్తిచూపుతోందనడంలో ఎలాంటి సందేహమూ లేదు.