వార్తలకు మతం రంగు
నియంత్రణ వ్యవస్థ లేకపోవడంపై సిజెఐ ఎన్‌వి రమణ ఆందోళన
న్యూఢిల్లీ: సోషల్ మీడియాలో నకిలీ వార్తలు పెరిగిపోతుండడంపై సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తి ఎన్‌వి రమణ ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో కొవిడ్19 వ్యాప్తికి తబ్లిగీ జమాతే సమావేశాలే కారణమని సోషల్ మీడియాలో వచ్చిన వార్తలకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌పై గురువారం చీఫ్ జస్టిస్ ఎన్‌వి రమణ నేతృత్వంలోని ధర్మాసననం విచారణ జరిపింది. ఈ సందర్భంగా చీఫ్ జస్టిస్ వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో వచ్చిన వార్తలకు మతం రంగు పులిమే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఇది దేశానికి ప్రమాదకరమని హెచ్చరించారు.‘దేశంలో ప్రతి విషయాన్ని మతం కోణంలో చూపుతున్నారు. ఇది దేశంపై దుష్ప్రభావం చూపుతోంది. సోషల్ మీడియా, వెబ్ పోర్టర్లలో కంటెంట్ విషయంలో జవాబుదారీతనం కనిపించడం లేదు. వీటిపై ఎలాంటి నియంత్రణలేకుండా పోయింది.
సామాజిక మాధ్యమాలు దేన్నయినా ప్రచురించగలుగుతున్నాయి. ఎవరైనా యూట్యూబ్ చానల్‌ను ప్రారంభించే అవకాశం ఉంది. నియంత్రణ వ్యవస్థ లేక వ్యక్తుల పరువుకునష్టం కలుగుతోంది. వ్యవస్థలు, న్యాయమూర్తులను కూడా చెడుగా చూపిస్తున్నారు’ అని సిజెఐ ఎన్‌వి రమణ అసంతృపి ్తవ్యక్తం చేశారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ కూడా న్యాయమూర్తులు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. శక్తివంతమైన వ్యక్తులు చెబితే మాత్రమే సోషల్ మీడియా సంస్థలు పట్టించుకుంటున్నాయని అభిప్రాయపడ్డారు. ఇక వివిధ హైకోర్టుల్లో దాఖలైన సోషల్ మీడియా కేసులన్నిటినీ సుప్రీంకోర్టుకు బదిలీ చేసి విచారించాలన్న కేంద్ర ప్రభుత్వ అభ్యర్థనపై సుప్రీంకోర్టు స్పందించింది.అన్ని పిటిషన్లను కలిపి విచారించడంపై నిర్ణయం తీసుకోవడానికి కేసును ఆరు వారాల తర్వాత లిస్ట్ చేయాని కేంద్ర ప్రభుత్వానికి సిజెఐ ఎన్‌వి రమణ సూచించారు. ఆ తర్వాత సోషల్ మీడియా కేసులన్నీ సుప్రీంకోర్టుకు బదిలీ చేయడంపై నిర్ణయం తీసుకోనున్నారు.