Sunday, December 22, 2024

బెయిల్ వచ్చేనా?

- Advertisement -
- Advertisement -

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కవిత బెయిల్ పిటిషన్‌పై మంగళవారం సుప్రీంకోర్టు తుది తీర్పును వెలువరించనుంది. ఈ నేపథ్యంలో బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు, కీలక నేతలతో కలిసి ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, పార్టీ అగ్రనేత హరీశ్‌రావులు ఢిల్లీకి వెళ్లారు. ఈ కేసులో ఇప్పటికే మనీష్ సిసోడియాకు బెయిల్ లభించిన నేపథ్యంలో ఎంఎల్‌సి కవితకు కూడా బెయిల్ లభిస్తుందని బిఆర్‌ఎస్ అధిషానం ధీమాగా ఉన్నట్లు తెలుస్తోంది. కవితకు బెయిల్ వస్తే సాదరంగా ఆహ్వానించి హైదరాబాద్‌కు తీసుకువచ్చేందుకు పార్టీ నేతలు ఢిల్లీకి వెళ్లినట్లు సమాచారం.

ఎంఎల్‌సి కవితకు జులై 1వ తేదీన బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. దీంతో కవిత ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై ఇప్పటికే వాదనలు పూర్తి కాగా, మంగళవారానికి (ఆగస్టు 27) సర్వోన్నత న్యాయస్థానం తీర్పును వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో ఎంఎల్‌సి కవితకు బెయిల్ వస్తుందని బిఆర్‌ఎస్ బలంగా విశ్వసిస్తుంది. ఈ క్రమంలోనే బిఆర్‌ఎస్ నేతలు కవితకు స్వాగతం పలికేందుకు ఢిల్లీకి క్యూ కట్టారు. బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు, రాజ్యసభ సభ్యులు, కీలక నేతలంతా ఢిల్లీకి తరలివెళ్లినట్లు తెలిసింది. అయితే మంగళవారం కవితకు బెయిల్ వస్తుందా..? లేదా..? అనే విషయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

బెయిల్‌పై న్యాయనిపుణుల భరోసా
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మనీష్ సిసోడియాకు బెయిల్ లభించిన నేపథ్యంలో బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కవితకు సైతం బెయల్ లభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు కవిత తీవ్ర అనారోగ్యంతో బాదపడుతున్నారు. ఆ కోణంలోనైనా సుప్రీంకోర్టు బెయిల్ ఇస్తుందని బిఆర్‌ఎస్ బలంగా నమ్ముతున్నట్లు తెలిసింది. మరోవైపు ఇటీవలే బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, పార్టీ అగ్రనేత హరీశ్ రావులు ఢిల్లీలో న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరిపి కవిత బెయిల్ అంశంపై చర్చించారు. అయితే న్యాయనిపుణులు బెయిల్ వస్తుందని భరోసా కల్పించినట్లు తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News