న్యూఢిల్లీ: విలువైన కోర్టు సమయాన్ని వృధా చేశారంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)పై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనికి తోడు స్టేషనరీ, లీగల్ ఫీజులు కూడా వృధా అయ్యాయని విచారం వెలిబుచ్చింది. పిటిషన్ దాఖలు చేసిన ఈడీ అధికారికి రూ. లక్ష జరిమానా విధించింది. అతడి జీతం నుంచి రికవరీ చేయాలని అధికారులను కోర్టు ఆదేశించింది. క్యాన్సర్‌తో బాధపడుతున్న ఓ నిందితుడికి బెయిల్ రద్దు చేయాలని కోరుతూ ఈడీ దాఖలు చేసిన పిటిషన్‌ను శనివారం సుప్రీం కోర్టు విచారించి ఈమేరకు ఈడీపై ఆగ్రహం ప్రదర్శించింది. క్యాన్సర్ బాధితుడైన నిందితుడు ఓ ప్రైవేట్ బ్యాంకులో పనిచేస్తున్నాడు. దాదాపు రూ. 24 కోట్ల మేర మోసం చేసినట్టు ఆయనపై ఆరోపణలు రావడంతో అరెస్టు చేశారు. గత ఏడాది నవంబర్ 12 న అలహాబాద్ హైకోర్టుకు పిటిషన్ రాగా, ఆయన చికిత్స తీసుకున్న కమలా నెహ్రూ దవాఖానా హెల్త్ రిపోర్టు ఆధారంగా హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దాంతో హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఈడీ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ ఎంఎం సుందరేష్‌లతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించి, పరిస్థితులను బట్టి నిందితుడు క్యాన్సర్ రోగి అయినందున ఈ కేసులో సుప్రీం కోర్టు జోక్యం అవసరం లేదని స్పష్టం చేసింది. ఇలాంటి పిటిషన్ దాఖలు చేసి సుప్రీం కోర్టు విలువైన సమయాన్ని వృధా చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.
Supreme Court fined Rs 1 lakh on ED