న్యూఢిల్లీ: ‘ఇండియాస్ గాట్ టాలెంట్’ షోలో అసభ్యకర వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ రణ్‌వీర్ అల్హాబాదియాపై సుప్రీం కోర్టు మండిపడింది. అతనిది చెత్త, వికృతమైన మనస్తత్వం అంటూ అసహనం వ్యక్తం చేసింది. జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం.. వాక్ స్వాతంత్ర్యం పేరుతో ఎలాంటి వ్యాఖ్యలు అయినా చేస్తారా అని ప్రశ్నించింది.
పాపులారిటీ కోసం సమాజానికి విఘాతం కలిగే విధంగా మాట్లాడితే.. ఎవరూ ఊరుకోరు అని స్పష్టం చేసింది. అసలు శృంగారంపై మాట్లాడేందుకు నోరు ఎలా వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. నీ మనస్సులో ఎంత చెత్త ఉందో దాన్ని బయటపెట్టేందుకు ఏదైనా లైసెన్స్ ఉందా అని ప్రశ్నించింది. షోలో రణ్‌వీర్ మాట్లాడిన విధానం ప్రతీ తల్లిదండ్రులు, అక్కచెల్లెలు, పిల్లలు సిగ్గుపడే విధంగా ఉన్నాయని తెలిపింది.
అయితే రణ్‌వీర్‌ని తీవ్రంగా మందలించిన అత్యున్నత న్యాయస్థానం ఆ తర్వాత స్వల్ప ఊరట కల్పించింది. ఈ వ్యవహారంలో మరో పోలీసు కేసు నమోదు చేయవద్దని.. కోర్టు అనుమతి లేకుండా దేశం వదలి వెళ్లకూడదని తెలిపింది. రణ్‌వీర్ పాస్‌పోర్టుని మహారాష్ట్రలోని థాణె పోలీసులకు అప్పగించాలని ఆదేశించింది. కొంతకాలంపాటు షోలకు దూరంగా ఉండాలని పేర్కొంది.