2023 చట్టం కింద ప్రధాన ఎన్నికల కమిషనర్ (సిఇసి), ఎన్నికల కమిషనర్ (ఇసి)ల నియామకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను ఏప్రిల్ 16న విచారించేందుకు సుప్రీం కోర్టు బుధవారం నిర్ణయించింది. ఈ కేసు జాబితాలో 38వ నంబర్‌తో ఉందని, ఆ క్రమంలో బుధవారం విచారణకు వచ్చే అవకాశం లేదని న్యాయవాది ప్రశాంత్ భూషణ్ చెప్పిన మీదట పిటిషన్ల విచారణకు ఏప్రిల్ 16ను న్యాయమూర్తులు సూర్యకాంత్, ఎన్ కోటీశ్వర్ సింగ్‌తో కూడిన ధర్మాసనం నిర్ధారించింది. ఈ వ్యవహారాన్ని సత్వరం విచారించవలసిందిగా ప్రశాంత్ భూషణ్ విజ్ఞప్తి చేశారు. ఇది ప్రజాస్వామ్య మూలంలోకి వెళుతుందని, 2023 రాజ్యాంగ ధర్మాసనం తీర్పు దీనికి వర్తిస్తున్నదని ఆయన వాదించారు. ఈ వాదనలు అన్నిటినీ కోర్టు అర్థం చేసుకుంటున్నదని, కానీ ప్రతి రోజు విచారించవలసిన జాబితాలో అత్యవసర విషయాలు అనేకం ఉన్నాయని జస్టిస్ కాంత్ తెలిపారు. ‘మేము దీనిని ఏప్రిల్ 16కు నిర్థారిస్తాం. దాని వల్ల కేసును అంతిమంగా విచారించగలం’ అని బెంచ్ తెలియజేసింది.
ప్రధాని, ప్రతిపక్ష నాయకుడు, భారత ప్రధాన న్యాయమూర్తి (సిజెఐ)తో కూడిన కమిటీ ద్వారా సిఇసి, ఇసిల నియామకం కోసం2023 రాజ్యాంగ ధర్మాసనం తీర్పును పాటించాలా లేక కమిటీలో నుంచి సిజెఐని మినహాయించిన 2023 చట్టాన్ని అనుసరించాలా అన్న స్వల్ప చట్టపరమైన ప్రశ్న ఇందులో ఇమిడి ఉందని పిటిషనర్ ఎన్‌జిఒ ప్రజాస్వామ్య సంస్కరణల సంస్థ (ఎడిఆర్) తరఫున హాజరైన ప్రశాంత్ భూషణ్ తెలిపారు. 2023 చట్టం కింద సిఇసి, ఇసిల నియామకానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను ‘ప్రాధాన్య ప్రాతిపదిక’పై తాము చేపడతామని ఫిబ్రవరి 18న సర్వోన్నత న్యాయస్థానం తెలియజేసింది. 2023 చట్టం కింద కొత్త సిఇసి, ఇసి నియామకం ద్వారా ప్రభుత్వం ‘ప్రజాస్వామ్యాన్ని ప్రహసనప్రాయం’ చేసిందని ప్రశాంత్ భూషణ్ ఆరోపించారు. ప్రభుత్వం ఫిబ్రవరి 17న ఇసి జ్ఞానేశ్ కుమార్‌ను సిఇసిగా నియమించింది. జ్ఞానేశ్ కుమార్ కొత్త చట్టం కింద నియుక్తుడైన తొలి సిఇసి.
తదుపరి లోక్‌సభ ఎన్నికల కార్యక్రమాన్ని ఇసి ప్రకటించవచ్చునని భావిస్తున్న కొన్ని రోజులకు ముందు 2029 జనవరి 26 వరకు ఆయన పదవీ కాలం కొనసాగుతుంది. కాగా, 1989 బ్యాచ్ హర్యానా కేడర్ ఐఎఎస్ అధికారి వివేక్ జోషి ఒక ఎన్నికల కమిషనర్‌గా నియుక్తుడయ్యారు. జోషి (58) 2031 వరకు ఎన్నికల కమిషన్‌లో కొనసాగుతారు. చట్టం ప్రకారం, సిఇసి గాని ఇసి గాని 65 ఏళ్లకు రిటైర్ అవుతారు లేదా ఆరు సంవత్సరాల పాటు ఎన్నికల కమిషన్‌లో పదవిలో ఉంటారు.