న్యూఢిల్లీ : సుప్రీం కోర్టు చరిత్రలో మూడోసారి మహిళా న్యాయమూర్తులతో ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటైంది. జస్టిస్ కోహ్లీ, జస్టిస్ బేలా ఎం. త్రివేదితో కూడిన ధర్మాసనాన్ని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ బుధవారం ఏర్పాటు చేశారు. ఈ మహిళాబెంచ్ గురువారం అనేక కేసులను విచారిస్తుంది. ఇందులో వైవాహిక గొడవలకు సంబంధించి 10 బదిలీ పిటిషన్లు, మరో 10 బెయిల్ పిటిషన్లు ఉన్నాయి. తొలిసారి 2013లో జస్టిస్ జ్ఞాన సుధామిశ్ర , జస్టిస్ రంజనా ప్రసాద్ దేశాయ్‌తో ద్విసభ్య ధర్మాసనం ఏర్పాటై అనేక కేసులను విచారించింది.
నిజానికి అది యాధృచ్ఛికంగా జరిగిందే. అప్పటి ప్రిసైడింగ్ జడ్జీ జస్టిస్ ఆఫ్తాబ్ ఆలమ్ గైర్హాజరుతో మహిళా ధర్మాసనాన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత 2018లో జస్టిస్ ఆర్. భానుమతి, జస్టిస్ ఇందిరా బెనర్జీతో మహిళా ధర్మాసనం ఏర్పాటైంది. ప్రస్తుతం సుప్రీం కోర్టులో 27 మంది నాయమూర్తులు ఉండగా, వీరిలో ముగ్గురు మహిళా జడ్జీలు ఉన్నారు. జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ బివి నాగరత్న , జస్టిస్ బేలా త్రివేది గత ఏడాది ఆగస్టు 31న ఒకేరోజు సుప్రీం కోర్టు న్యాయమూర్తులుగా ప్రమాణస్వీకారం చేశారు. వీరు ప్రమాణం చేసే నాటికి జస్టిస్ ఇందిరాబెనర్జీ కూడా సుప్రీం కోర్టు జడ్జీగా ఉన్నారు.
సుప్రీం కోర్టులో అత్యధికంగా నలుగురు మహిళా న్యాయమూర్తులు ఉన్నది అప్పుడే. ఈ ఏడాది అక్టోబరులో జస్టిస్ ఇందిరాబెనర్జీ పదవీ విరమణ చేశారు. ఇక జస్టిస్ బివి నాగరత్న, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రేసులో ఉన్నారు. 2027 లో ఆమె 36 రోజుల పాటు సీజేగా బాధ్యతలు చేపట్టే అవకాశముంది. అదే జరిగితే , సుప్రీం కోర్టుకు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా ఆమె అపూర్వ ఘనత సాధిస్తారు. కాగా, 2020 లో మద్రాస్ హైకోర్టు చీఫ్ జస్టిస్ అమరేశ్వర్ ప్రతాప్ తొలిసారి ముగ్గురు న్యాయమూర్తులతో పూర్తి స్థాయి బెంచ్ ఏర్పాటు చేశారు.