న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైదరాబాద్ సమీపంలో దిశ అత్యాచారం, హత్య కేసులో నలుగురు నిందితుల కాల్చివేతకు దారితీసిన పరిస్థితులపై తుది నివేదిక సమర్పించడానికి సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి విఎస్ సర్పూర్కర్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీకి సుప్రీంకోర్టు మరో ఆరు నెలల గడువు ఇచ్చింది. దర్యాప్తు పూర్తి చేయడానికి ఇంకా ఎంత సమయం కావాలనిప్రధాన న్యాయమూర్తి ఎన్‌వి రమణ నేతృత్వంలోని ధర్మాసనం కమిటీ తరఫు న్యాయవాదిని అడిగింది. అంతేకాదు ఉత్తరప్రదేశ్‌లో గ్యాంగ్‌స్టర్ వికాస్‌దూబే ఎన్‌కౌంటర్‌పై దర్యాప్తుకు ఏర్పాటు చేసిన కమిటీ ఇప్పటికే నివేదిక ఇచ్చిన విషయాన్ని కూడా ధర్మాసనం గుర్తు చేసింది. అయితే దర్యాప్తు పూర్తి చేయడానికి మరికొంత సమయం కావాలని కమిటీ తరఫు న్యాయవాది కోరడంతో ఆరు నెలల సమయం ఇస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది.
2019 నవంబర్ 27న హైదరాబాద్ శివార్లలో జతీయ రహదారిపై వెటర్నరీ వైద్యురాలిని నలుగురు దుండగులు కిడ్నాప్ చేసి అనంతరం అత్యాచారం చేసి మృతదేహాన్ని కాల్చివేసిన విషయం తెలిసిందే. అనంతరం జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు నిందితులను పోలీసులు కాల్చి చంపడం సంచలనం సృష్టించింది. ఈ ఎన్‌కౌంటర్‌కు దారి తీసిన పరిస్థితులపై సుప్రీంకోర్టు అదే ఏడాది డిసెంబర్‌లో రిటైర్డ్ న్యాయమూర్తి సర్పూకర్ నేతృత్వంలో ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసి ఆరు నెలల్లోగా నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ఆ తర్వాత న్యాయస్థానం ఈ కమిటీ గడువును మూడు సార్లు పెంచింది. అయినప్పటికీ దర్యాప్తు నివేదిక సమర్చించకపోవడం పట్ల న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసింది. ఆరు నెలల్లో తుది నివేదిక సమర్పించాలని కమిటీని ఆదేశించింది.