Monday, January 20, 2025

ద్వేష భాష బాధ్యత ప్రభుత్వాలదే

- Advertisement -
- Advertisement -

భారతీయ సమాజానికి అతి పెద్ద బెడదగా, దుర్భర సామాజిక భారంగా తయారైన విద్వేష ప్రసంగాల విషయంలో సుప్రీంకోర్టు శుక్రవారం నాడు ఇచ్చిన సమగ్ర ఉత్తర్వులు దేశాన్ని కుట్రపూరిత మతోన్మాద శక్తుల నుంచి ఎంత వరకు కాపాడుతాయో గాని, రాజ్యాంగంలో నిర్దేశించిన సెక్యులర్ భారత ఆశయాన్ని కాపాడడానికి దేశ అత్యున్నత న్యాయస్థానం కంకణం కట్టుకొన్నట్టు సందేహాతీతంగా రూఢి చేస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ విద్వేష ప్రసంగాలు ఊహించనంతగా జోరందుకున్నాయి. మెజారిటీ మత రాజ్యాన్ని నెలకొల్పాలని బిజెపి పాలకులు సంకల్పించి ఆ వైపుగా అడుగులు వేస్తున్న కొద్దీ మైనారిటీలు ముఖ్యంగా ముస్లింల పట్ల విద్వేషాన్ని రగిలించే నిర్వాకం అవధులు మీరిపోతున్నది. మతం, భాష, కులం, ప్రాంతం వగైరాల ప్రాతిపదికగా విద్వేషాన్ని రెచ్చగొట్టే ప్రసంగాలు చేసే వారికి భారత శిక్షాస్మృతి 153ఎ, 153బి, 295ఎ, 298, 505(1), 505(2) సెక్షన్ల కింద శిక్షలు విధించే అవకాశాన్ని చట్టం కల్పిస్తున్నది.

కాని ఆ సెక్షన్లను ఉపయోగించి వారిపై గట్టి చర్యలు తీసుకుంటున్న సందర్భాలు మచ్చుకి కూడా కనిపించవు. భారతీయ జనతా పార్టీ పాలనలోని కర్నాటక రాష్ట్రంలో గత మూడేళ్ళలో 100కు పైగా విద్వేష ప్రసంగాల కేసులు నమోదయ్యాయి. ఇందులో 52% కేసులు ఆ రాష్ట్ర రాజధాని బెంగళూరులోనే రికార్డయ్యాయి. కాని ఎంత మందికి శిక్షలు పడ్డాయి అనే దానికి సరైన సమాధానం లేదు. పరిష్కారానికి నోచుకోకుండా పోలీసుల వద్ద పెండింగ్‌లో వున్న కేసుల సంఖ్యే ఏడాదికేడాదికీ పెరిగిపోతూ వుండడం విద్వేష ప్రసంగాలను నిరోధించడంపై మనకున్న శ్రద్ధను చాటుతున్నది. 201620 మధ్య దాఖలైన కేసుల్లో 59% తగిన సాక్షాధారాలు లేకుండా మూతబడ్డాయంటే పోలీసుల దర్యాప్తు లోపం ఎంతగా వుందో అర్థమవుతున్నది. వాస్తవానికి సుప్రీంకోర్టు షహిన్ అబ్దుల్లా x కేంద్ర ప్రభుత్వం కేసులో 2022లో ఉత్తర్వులు జారీ చేస్తూ ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, ఢిల్లీ రాష్ట్రాల్లో విద్వేష ప్రసంగాలపై ఆయా ప్రభుత్వాలు తమంత తామే కేసులు పెట్టాలని ఆదేశించింది.

ఇప్పుడు ఈ స్వచ్ఛంద చర్యల ఆదేశాన్ని అన్ని రాష్ట్రాలకూ వర్తింప చేసింది. అంటే దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలు విద్వేష ప్రసంగాలపై వెంటనే తమంత తాముగానే కేసులు దాఖలు చేయాలని ఆదేశించింది. ఇందులో ఏ మాత్రం జాప్యం జరిగినా న్యాయస్థాన ధిక్కార నేరం కింద పరిగణిస్తామని హెచ్చరించింది. విద్వేష ప్రసంగానికి ఏ మతస్థులు పాల్పడినా చర్య తీసుకోవాలని స్పష్టం చేసింది. న్యాయమూర్తులకు రాజకీయాలతో సంబంధం వుండదని, భారత రాజ్యాంగం ఒక్కటే వారికి మార్గదర్శి అని జస్టిస్‌లు కెఎం జోసెఫ్, బివి నాగరత్నల ధర్మాసనం స్పష్టం చేసింది. బిజెపి అధికార ప్రతినిధులుగా వుంటూ నూపుర్ శర్మ, నవీన్ జిందాల్ చేసిన విద్వేష ప్రసంగాలపై తీవ్ర వ్యతిరేకత దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా వ్యక్తమైంది. వీరు మొహమ్మద్ ప్రవక్తను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను సౌదీ అరేబియా, ఇరాన్, ఇండోనేషియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కువైట్, కతార్, బెహ్రెయిన్, ఒమన్‌లు తీవ్రంగా పరిగణించాయి.

ముస్లిం ప్రపంచం ఉమ్మడి ప్రతినిధిగా భావించే ఇస్లామిక్ సహకార సంస్థ కూడా వీటితో చేరింది. వీరిద్దరి వ్యాఖ్యలు ప్రవక్తను అవమానించాయని సౌదీ అరేబియా వ్యాఖ్యానించింది. ఇస్లామిక్ మత చిహ్నాలకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా దానిని ఖండిస్తామని చెప్పింది. వీరిద్దరి వ్యాఖ్యలు నైతిక, మానవీయ విలువలకు విరుద్ధమైనవని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పేర్కొన్నది. ఈ నేపథ్యంలో తప్పనిసరై నూపుర్ శర్మను సస్పెన్షన్‌లో పెట్టి, జిందాల్‌ను పార్టీ నుంచి బహిష్కరించారు. అంత వరకు మౌనం పాటించిన భారత ప్రభుత్వం ఆర్థికంగా మనకెంతో ఉపయోగకరమైన దేశాల నుంచి ఖండనలు వెలువడగానే చర్య తీసుకోడం దాని నిజాయితీ రాహిత్యాన్ని చాటింది. విద్వేష భాష సమాజంలోని భిన్న వర్గాల మధ్య సఖ్యతను బలి తీసుకొంటుంది. అది అంతిమంగా దేశ సమగ్రతను దెబ్బ తీస్తుంది. మెజారిటీ, మైనారిటీ అనే తేడా లేకుండా ప్రజలందరూ శాంతియుత సహజీవనం చేసినప్పుడే దేశం భద్రంగా వుంటుంది.

మైనారిటీలను రెచ్చగొట్టే కొద్దీ ఉగ్రవాద శక్తులకు బీజాలు పడతాయి. వారిని అణచివేయడం, అందుకు ప్రతిగా వారు హింసాయుత దాడులకు పాల్పడడం జరుగుతుంది. ఆ దాడుల్లో ఎవరి ప్రాణాలైనా బలి అయ్యే ప్రమాదముంది. మొత్తం మీద దేశ జన జీవనమే అతలాకుతలమవుతుంది. రెచ్చగొట్టి కఠినంగా వ్యవహరించడం వల్ల కీడే గాని మేలు జరగదు. భారత రాజ్యాంగం ఆర్టికల్ 19 ద్వారా భావ ప్రకటన స్వేచ్ఛ నిచ్చింది. అదే సమయంలో దానిపై పరిమితులను కూడా విధించింది. దీనిని గమనించి వ్యవహరించడం ప్రతి భారత పౌరుని బాధ్యత.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News