అత్యాచార కేసులో జీవితఖైదు అనుభవిస్తున్న వివాదాస్పద స్వామీజీ ఆశారాంకు సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అనారోగ్య కారణాల నేపథ్యంలో న్యాయస్థానం ఆశారాంకు మార్చి 31 వరకు బెయిల్ మంజూరు చేసింది. బెయిలుపై విడుదలైన ఆయన తన అనుచరులను కలవకూడదని కోర్టు ఆదేశించింది. అంతేకాక, ఆశారాం ఆస్పత్రికి వెళ్లేటప్పుడు భద్రత కల్పించాలే తప్ప ఆయన ఎక్కడికి వెళ్లాలో నిర్దేశించవద్దని పోలీసులను కోరింది. గుజరాత్ మోతేరా లోని ఆశారాం ఆశ్రమంలో పనిచేస్తున్న సమయంలో తనపై ఆయన పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడినట్టు సూరత్‌కు చెందిన ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
2001 నుంచి 2006 మధ్య తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారని ఆమె ఆరోపించింది.న దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆశారాంతోపాటు మరో ఏడుగురిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో గాంధీనగర్ సెషన్స్ కోర్టు ఆయనను దోషిగా తేల్చింది. మిగిలిన వారికి సంబంధించి ఎలాంటి సాక్షాధారాలు లేకపోవడంతో వారిని విడుదల చేశారు. అనంతరం ఆశారాం కు జీవిత ఖైదు విధిస్తూ తీర్పునిచ్చింది. జోథ్‌పూర్ లోని ఆశ్రమంలో ఓ 16 ఏళ్ల బాలికపై అత్యాచారం కేసులోనూ ఆయన దోషిగా తేలారు. ఈ కేసులోనూ ఆయనకు జీవితఖైదు పడింది.