Friday, March 7, 2025

సుప్రీకోర్టులో ఉదయనిధి కి ఊరట

- Advertisement -
- Advertisement -

సనాతన ధర్మం విషయంలో చేసిన వ్యాఖ్యలపై తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ కు సుప్రీంకోర్టులో కొద్దిగా ఊరట లభించింది. ఈ వ్యాఖ్యలపై కొత్తగా కేసులు దాఖలు చేయడాన్ని అత్యున్నత ధర్మాసనం నిషేధించింది. కోర్టు అనుమతిస్తే తప్ప కొత్తగా ఈ అంశంలో కేసులు నమోదు చేయరాదని సుప్రీంకోర్టు రూలింగ్ ఇచ్చింది. ఉదయనిధి స్టాలిన్ దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. ఉదయనిధి స్టాలిన్ 2024 సెప్టెంబర్ లో సనాతన ధర్మ కూడా డెంగ్యూ, మలేరియా వంటి ఓ రోగమే అని దానిని నిర్మూలించాలని చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా దుమారం చెలరేగింది. దేశవ్యాప్తంగా సాంప్రదాయవాదులు , పలు ధార్మిక సంస్థలు ఈ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ కొడుకు అయిన ఉదయనిధి స్టాలిన్ తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు.

తాను ఏ మతాన్ని కించపరచ లేదని, కుల ఆధారిత వివక్షను, సామాజిక అన్యాయాలనే విమర్శిస్తున్నానని వాదించారు. ఉదయనిధి తరుపున సుప్రీంకోర్టులో సీనియర్ లాయర్ అభిషేక్ మను సింఘ్వీ హాజరై, వివిధ రాష్ట్రాలలో ఇప్పటికే ఈ అంశంలో పలు ఎఫ్ ఐ ఆర్ లు నమోదు కాగా, తాజాగా బీహార్ కొత్తగా కేసు నమోదయినట్లు కోర్టుకు విన్నవించారు. దీంతో ఈ అంశంపై కొత్త కేసులు నమోదు చేయడానికి వీలు లేదని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ కేసులు అన్నింటినీ తమిళనాడుకు కాకపోతే, కర్ణాటకకు బదిలీ చేసేవిషయం పరిశీలించనున్నట్లు కోర్టు వెల్లడించింది. ఉదయనిధి స్టాలిన్ పై మరిన్ని కొత్త కేసులు దాఖలు కాకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇస్తూ , కేసు తదుపరి విచారణను 2025 ఏప్రిల్ 28వ తేదీకి వాయిదా వేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News