హైదరాబాద్: హుస్సేన్ సాగర్ లో ఈ ఏడాది ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వినాయక విగ్రహాల నిమజ్జనానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇదే చివరి అవకాశంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. ఈ మేరకు అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషన్ ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ఉత్సవాలు జరుగుతున్న సమయంలో హై కోర్ట్ ఆర్డర్ వచ్చిందని రాష్ట్ర ప్రభుత్వ తరఫు న్యాయవాది, సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు. విగ్రహాలు చాలా వరకు ఎత్తుగా ఉన్నాయని, అకస్మాత్తుగా ఉత్తర్వులను అమలు చేయడంతో అనేక ఇబ్బందులు వస్తాయని చెప్పారు. ఇది ప్రతి సంవత్సరం వస్తున్న ఇబ్బందని చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. వచ్చే ఏడాది ఈ ఆర్డర్ ను అమలు చేస్తామని తుషార్ మెహతా తెలిపారు. ఇప్పటికే హుస్సేన్ సాగర్ చుట్టూ క్రేన్ లు ఏర్పాటు చేశామని, కాలుష్యం జరగకుండా వెంట వెంటనే విగ్రహాలను తరలించడం జరుగుతుందని చెప్పారు. 22 చిన్న పాండ్స్ ఏర్పాటు చేసామని, కానీ అందులో పెద్ద పెద్ద విగ్రహాలు నిమజ్జనం సాధ్యం కాదని తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాది తెలిపారు. హైదరాబాద్ వినాయక నిమజ్జనం ఇబ్బందులు తనకు తెలుసని, హుస్సేన్ సాగర్ పరిశుభ్ర పరిచేందుకు ప్రతి ఏడాది నిధులు ఖర్చు చేస్తున్నారని.. ప్రతి సంవత్సరం విగ్రహాలను నిమజ్జనం చేయడం ద్వారా నిధులు వృధా అవ్వడం లేదా అని ప్రశ్నించిన ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ రాష్ట్ర ప్రభుత్వం తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
Supreme Court Green Signal for Ganesh Nimajjanam