న్యూఢిల్లీ: దేశంలో ఎస్‌సి/ఎస్‌టి ఉప వర్గీకరణకు సంబంధించి అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు గురువారం కీలక తీర్పు వెలువరించింది. ఈ కులాల ఉపవర్గీకరణను చేసుకునే హక్కు రాష్ట్రాలకు ఉందని 6:1 మెజార్టీతో ప్రధాన న్యాయమూర్తితో కూడిన విస్తృత ధర్మాసనం వెలువరించిన తీర్పు రాష్ట్ర ప్రభుత్వాలలో తీవ్రస్థాయి కదలికలకు దారితీసింది. విద్యాసంస్థల్లో ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగాలలో రిజర్వేషన్ల కల్పన లేదా కోటాకు సంబంధించి ఈ వర్గాల వాటాలో ఉప వర్గీకరణ లేదా సబ్ క్లాసిఫికేషన్ చేసుకునే సంపూర్ణ అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని మెజార్టీ తీర్పులో పేర్కొన్నారు.
ఈ క్రమంలో 2004లో ఐదుగురు సభ్యుల ధర్మాసనం వెలువరించిన తీర్పును ఈ ధర్మాసనం పక్కకు పెట్టింది. ఇప్పుడు అన్ని విషయాలు పరిగణనలోకి తీసుకుని రిజర్వ్‌డ్ కేటగిరిలోని అణగారిన కులాల అభ్యున్నతికి ఉప వర్గీకరణ కల్పించుకునేందుకు రాష్ట్రాలకు వీలుంటుందని ధర్మాసనం పేర్కొంది. ఈ ఉపవర్గీకరణకు సంబంధించిన విధి విధానాలు, మార్గదర్శకాలను ఇక రాష్ట్ర ప్రభుత్వాలు ఖరారు చేసుకోవచ్చునని ఈ తీర్పునేపథ్యంలో తెలిపారు. మొత్తం ఏడుగురు సభ్యుల ధర్మాసనంలో ఒక న్యాయమూర్తి విభేదించారు. ఈ క్రమంలో ధర్మాసనం ఆరు వేర్వేరు తీర్పులను వెలువరించింది. మెజార్టీ తీర్పు ఉపవర్గీకరణకు అనుకూలంగా ఉంది. రాష్ట్రాలు సమర్పించుకున్న ప్రామాణిక, వాస్తవిక గణాంకాలను సమర్థిస్తూ ఉప వర్గీకరణకు సమ్మతి తెలియచేయడం కీలక అంశం అయిందని తెలిపారు.
డేటాకు అనుగుణంగానే తాము స్పందించామని, ఇందులో తమ ఇష్టాయిష్టాల ప్రమేయం ఏదీ ఉండదని స్పష్టం చేశారు. ఏడుగురు సభ్యుల ధర్మాసనంలో ప్రధాన న్యాయమూర్తితో పాటు న్యాయమూర్తులు బిఆర్ గవాయ్, విక్రమ్ నాథ్ , బేలా ఎం త్రివేది , పంకజ్ మిట్టల్, మనోజ్ మిస్రా, సతీష్ చంద్ర మిశ్రా ఉన్నారు. వీరిలో జస్టిస్ త్రివేది ప్రధాన తీర్పుతో విభేదించారు. సిజెఐ సొంతంగా, జస్టిస్ మిశ్రా, నలుగురు జడ్జిలు కూడా ప్రధాన తీర్పుతో ఏకీభవిస్తూ వేర్వేరు తీర్పులు ఇచ్చారు. కాగా జస్టిస్ త్రివేది విభేదించారు. ఎస్‌సి, ఎస్‌టిల్లోని పలు ఉపకులాలు వారికున్న వెనుకబాటుతనాన్ని తరాలైన అధిగమించలేకపోతున్నారు. ఈ క్రమంలో వారు అభ్యున్నతిని సాధించేందుకు వీలు కల్పించాల్సి ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది. వ్యవస్థాగతంగా ఉన్న వివక్షతల క్రమంలో ఎస్‌సి / ఎస్‌టి వర్గాల వారు ఆశించిన విధంగా అభ్యున్నతికి నోచుకోవడం లేదు.
ఒక కులంలో ఉపవర్గీకరణకు సంబంధించి అధికారం కల్పించేందుకు రాజ్యాంగంలోని 14వ అధికరణ వీలు కల్పించింది. దీనిని పరిగణనలోకి తీసుకునే తాము 2004 నాటి ఇవి చిన్నయ్య తీర్పును వ్యతిరేకిస్తున్నామని ధర్మాసనం తెలిపింది. ప్రదాన తీర్పును సమ్మతిస్తూనే జస్టిస్ గవాయ్ ప్రత్యేక తీర్పు వెలువరించారు. రాష్ట్రాలు ముందుగా చేయాల్సిన పని ఎంతో ఉంది. ముందు ఎస్‌సి, ఎస్‌టిలలో క్రిమిలేయర్‌ను గుర్తించాల్సిన బాధ్యత రాష్ట్రాలపై ఉంది. ఈ క్రమంలో కొన్ని వర్గాలను కోటా పరిధి నుంచి తప్పించాల్సి ఉంటుందని ఈ తీర్పులో వివరించారు.జస్టిస్ గవాయ్ సొంతంగా 281 పేజీల తీర్పు వెలువరించారు. ప్రభుత్వోద్యోగాలలో సరైన ప్రాతినిధ్యం లేకుండా ఉన్న వెనుకబడిన వర్గాల పౌరులకు సరైన న్యాయం చేయాల్సిన బాధ్యత రాష్ట్రాలపై ఉందని ఈ క్రమంలో తెలిపారు. ఈ దశలో రిజర్వ్‌డ్ కోటాలోని వర్గాలలోని సంపన్నులను గుర్తించాల్సి ఉంటుంది. రాజ్యాంగం ప్రకారం వాస్తవికమైన సమానత సాధన కీలకం.
కోటా పరిధిలోని కులాలు వారి ప్రస్తుత వాస్తవిక ఆర్థిక స్థితిగతులను నిర్థిష్టంగా పరిగణలోకి తీసుకుని తీరాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. సహేతుకతోనే రిజర్వేన్ల అమలువల్లనే సామాజిక సాధికారికత , న్యాయం జరుగుతుందని ఇది తన అభిప్రాయం అని తెలిపారు. క్రిమిలేయర్ పద్ధతిని ఎస్‌సి, ఎస్‌టిలకు కూడా వర్తింపచేయాలని తాను జస్టిస్ గవాయ్‌తో ఈ విషయంలో ఏకీభవిస్తున్నానని జస్టిస్ విక్రమ్ నాథ్ తెలిపారు.జస్టిస్ పంకజ్ మిశ్రా స్పందిస్తూ ఎప్పటికప్పుడు కోటా ప్రయోజనాలను పొందుతున్న వారి పరిస్థితిని సమీక్షించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. సాధారణ కేటగిరిలోని వారి స్థితికి చేరిన వారికి కూడా రిజర్వేషన్లు కల్పించడం ఎంతవరకు సబబు అవుతుందని ప్రశ్నించారు.
రిజర్వేషన్లు నిరంతర ప్రక్రియ అయితే కష్టమే
రిజర్వేషన్లు అనేవి కేవలం తొలి తరానికి, పోనీ మరో తరానికి పరిమితం కావల్సి ఉంటుందని జస్టిస్ మిట్టల్ తమ వేరు తీర్పులు తెలిపారు. కోటాను అనుభవిస్తూ ఎదిగితే, ఉన్నత స్థాయిని పొందితే ఇక వారిలో తరువాతి వారికి కోటా వర్తింపు అనేది సహేతుకం అవుతుందా? అని ప్రశ్నించారు. జస్టిస్ సతీష్ చంద్ర తమ తీర్పులో రాష్ట్రాలు క్రిమిలేయర్లను గుర్తించడం అనేది రాజ్యాంగ తప్పనిసరి అంశం అవుతుందనే ప్రధాన తీర్పులోని అంశంతో తాను ఏకీభవిస్తున్నట్లు తెలిపారు.
జస్టిస్ బేలా త్రివేది విభిన్న తీర్పు
ప్రధాన తీర్పును వ్యతిరేకించిన జస్టిస్ బేలా త్రివేది పలు కీలక విషయాలు ప్రస్తావించారు. రాష్ట్రాలకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 341 అధికరణ పరిధిలో నోటిఫై అయిన ఎస్‌సి జాబితాలో మార్పు చేర్పులు చేసే అధికారం లేదని పేర్కొన్నారు. రాష్ట్రాలు ఏ చర్య తీసుకున్నా, నిర్థిష్ట కార్యాచరణకు దిగినా అది పూర్తిగా రాజ్యాంగం పరిధిలోనే ఉండాలని, ఈ లక్ష్మణరేఖ పాటించాల్సి ఉందని ఆమె తెలిపారు. రాష్ట్రాలు సదుద్ధేశంతోనే రిజర్వేషన్ల కల్పనలో చర్యలు తీసుకున్నప్పటికీ సుప్రీంకోర్టు ఈ చర్యలను ఆర్టికల్ 142 పరిధిలోని అధికారాలను వినియోగించుకుని సమర్థించడానికి వీల్లేదని పేర్కొన్నారు.
పంజాబ్ చట్టం వర్గీకరణ వ్యాజ్యానికి మూలం
దేశంలోని ఎస్‌సి/ ఎస్‌టి కులాల్లో పలు ఉపకులాలు ఉన్నాయి. అన్ని ఉపకులాలకు సంక్షేమం ఆలోచనతో ప్రభుత్వ ఉద్యోగాలలో ఎస్‌సి కోటా రిజర్వేషన్లలో 50 శాతాన్ని వాల్మీకి, మజహబీ సిక్కు వర్గాలకు తొలి ప్రాధాన్యత క్రమంగా పేర్కొంటూ 2006లో పంజాబ్ ప్రభుత్వం చట్టం తీసుకువచ్చింది. అయితే ఈ ఉపవర్గీకరణ చట్టం చెల్లనేరదని ్ల 2010లో పంజాబ్ హర్యానా హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఇవి చిన్నయ్య వర్సెస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కేసులో సుప్రీంకోర్టు 2004లో వెలువరించిన తీర్పును ఉల్లంఘించేలా ఈ పంజాబ్ చట్టం ఉందని హైకోర్టు పేర్కొంది.
షెడ్యూల్ కులాల జాబితాలోకి ఏ సామాజిక వర్గాన్ని చేర్చినా , ఎత్తివేసినా చేయాల్సిన అధికారం కేవలం పార్లమెంట్‌కే ఉంటుందని, రాష్ట్రాల అసెంబ్లీలకు సంబంధిత చట్టాలకు కాదని అప్పట్లో 2004 నాటి తీర్పులో పేర్కొన్నారు. దీనిని పంజాబ్ హర్యానా హైకోర్టు ప్రస్తావించింది. పంజాబ్ హైకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ పంజాబ్ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలోనే 22 పిటిషన్లు దాఖలు అయ్యాయి. ఎంఆర్‌పిఎఎస్ వ్యవస్థాపకులు మంద కృష్ణ మాదిగ కూడా కీలక వ్యాజ్యం దాఖలు చేసిన వారిలో ఒక్కరు. ఈ పిటిషన్లన్నింటిని విచారించిన ఐదుగురు సభ్యుల ధర్మాసనం దీనిని2020లో విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది. ఈ ఏడాది ఆరంభంలో విచారణ జరిపి ఈ ధర్మాసనం ఈ ఏడాది ఫిబ్రవరి 8న తీర్పును రిజర్వ్ చేసింది. ఇప్పుడు తీర్పు ఇచ్చింది. ఎస్‌సి ఎస్‌టి కోటాలో ఉప వర్గీకరణకు ఓకె చెప్పింది.