అరెస్టు చేయవద్దని ఆదేశం
ఒటిటిల కట్టడికి కేంద్రం నిబంధనలకు కోరలు లేవు
అవి కేవలం మార్గదర్శకాలే, చట్టం చేయాలని వ్యాఖ్య
న్యూఢిల్లీ: ఒటిటి ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఇండియా హెడ్ అపర్ణా పురోహిత్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. వెబ్ సిరీస్ ‘తాండవ్’కు సంబంధించిన కేసులో దర్యాప్తుకు ఆమె సహకరిస్తారని, ఆమెను అరెస్టు చేయవద్దని సుప్రీంకోరర్టు ఆదేశించింది. ఒటిటికి సంబంధించిన కొత్త నిబంధనలకు కోరలు లేవని, అవి కేవలం మార్గదర్శకాలు మాత్రమేనని కేసును విచారించిన జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. కేవలం కొన్ని మార్గదర్శకాలు కాకుండా ఓ చట్టాన్ని రూపొందించాలని కేంద్రాన్ని కోరింది. ఒటిటి ప్లాట్‌ఫామ్‌లో వస్తున్న కంటెంట్‌ను స్క్రీనింగ్ చేయడానికి,అవసరమైన చర్యలు తీసుకునేందుకు అనువైన నియమావళి ఒటిటి కొత్త నిబంధనల్లో లేవని కోర్టు స్పష్టం చేసింది.
కాగా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకునే విషయాన్ని పరిశీలిస్తోందని, దీనికి సంబంధించి ఏదయినా చట్టం తీసుకు వచ్చిన పక్షంలో కోర్టు ముందు ఉంచుతామని ప్రభుత్వం తరఫున హాజరైన సొటిసిటర్ జనరల్ తుషార్ మెహతా బెంచ్‌కి తెలియజేశారు.‘ తాండవ్’ వెబ్ సిరీస్ ద్వారా మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు పురోహిత్ ప్రయత్నిస్తున్నారంటూ ఉత్తరప్రదేశ్ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. దీంతో ముందస్తు బెయిల్ కోసం అలహాబాద్ హైకోర్టును ఆమె ఆశ్రయించగా న్యాయస్థానం బెయిలు నిరాకరించింది. గత నెల 25న అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన అదేశాలను ఆమె సుప్రీంకోర్టులో సవాలు చేశారు. పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం శుక్రవారంఅపర్ణకు అరెస్టునుంచి రక్షణ కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది.