Tuesday, December 24, 2024

అదానీ వ్యవహారంపై రేపు సుప్రీం విచారణ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : అదానీ గ్రూప్ సంస్థలపై హిండెన్‌బర్గ్ నివేదిక దేశంలో తీవ్ర రాజకీయ దుమారానికి దారి తీసింది. ఈ వ్యవహారంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయాలని లేదా కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరిపించాలని గత కొన్ని రోజులుగా పార్లమెంట్‌లో ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వివాదం సుప్రీం కోర్టుకు చేరింది. అదానీ వ్యవహారంపై దర్యాప్తునకు ఆదేశాలివ్వాలని కోరుతూ పిటిషన్ దాఖలైంది.

దీనిపై సర్వోన్నత న్యాయస్థానం శుక్రవారం విచారణ చేపట్టనున్నది. అదానీ గ్రూప్ పై హిండెన్‌బర్గ్ ఇచ్చిన నివేదికపై దర్యాప్తు చేసేందుకు సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తి పర్యవేక్షణలో ఓ కమిటీని ఏర్పాటు చేసేలా కేంద్రానికి ఆదేశాలివ్వాలని కోరుతూ న్యాయవాది విశాల్ తివారీ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై అత్యవసర విచారణ చేపట్టాలని సీజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ ధర్మాసనం ముందు అభ్యర్థించారు. ఈ పిటిషన్‌ను స్వీకరించిన సర్వోన్నత న్యాయస్థానం… దీనిపై శుక్రవారం విచారణ జరుపుతామని తెలిపింది. దీనిపై గతవారం కూడా సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది.

అదానీ గ్రూప్ పై సంచలన నివేదిక ఇచ్చి ఆ సంస్థ మార్కెట్ విలువ పతనానికి కారణమైన హిండెన్‌బర్గ్ రీసెర్చి సంస్థ యజమాని నాథన్ అండర్సర్, అతడి అనుచరులపై దర్యాప్తునకు ఆదేశించాలని సీనియర్ న్యాయవాది ఎంఎల్‌శర్మ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కూడా శుక్రవారం సుప్రీం కోర్టు విచారణ చేపట్టనుంది. అదానీ గ్రూప్ తన షేర్లలో అవకతవకలకు పాల్పడుతోందని, ఖాతాల్లోనూ మోసాలు చేస్తోందంటూ హిండెన్‌బర్గ్ ఇచ్చిన నివేదిక తీవ్ర దుమారానికి దారి తీసిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణలను అదానీ గ్రూప్ తీవ్రంగా ఖండించింది. కాగా… ఈ నివేదిక నేపథ్యంలో ఇటీవల అదానీ సంస్థకు చెందిన కంపెనీల షేర్లు భారీగా పతనమయ్యాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News