కర్నాటక హైకోర్టు తీర్పుపై పిటిషన్లు
న్యూఢిల్లీ: కర్నాటకలోని విద్యా సంస్థలలో హిజాబ్ ధారణపై నిషేధం తొలగించేందుకు ఆ రాష్ట్ర హైకోర్టు నిరాకరించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై వచ్చే వారం విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు బుధవారం అంగీకరించింది. పిటిషన్లు దాఖలు చేసి చాలా కాలం అయినప్పటికీ ఇవి విచారణకు రావడం లేదంటూ సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ చేసిన వినతిని పరిగణనలోకి తీసుకున్న చీఫ్ జస్టిస్ ఎన్‌వి రమణ, జస్టిస్ కృష్ణ మురారి, జస్టిస్ హిమా కోహ్లిలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం వీటిపై వచ్చే వారం విచారణ చేపడతామని తెలియచేసింది. బాలికలు తమ చదువు తప్ప ఆసక్తి కోల్పోతున్నారని, వారు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రశాంత్ భూషణ్ ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ..రెండు ధర్మాసనాలు పనిచేయడం లేదని, ఈ కారణంగా మిగిలిన ధర్మాసనాలకు వివిధ కేసులను తిరిగి పంపిణీ చేయాల్సి వచ్చిందని తెలిపింది. వచ్చే వారం ఏదో ఒకరోజు తగిన ధర్మాసనం ఎదుట ఈ కేసును ఉంచుతామని తెలిపింది.