న్యూఢిల్లీ: ఎలెక్టోరల్ బాండ్ పథకం ద్వారా రాజకీయ పార్టీలకు విరాళాలు ఇవ్వడానికి అనుమతించే చట్టాలను సవాలు చేస్తూ దాఖలైన పిల్‌పై విచారణ చేపట్టడానికి సుప్రీంకోర్టు మంగళవారం అంగీకరించింది. ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేసిన అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్ అనే ఎన్జీఓ తరఫున సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ మంగళవారం చీఫ్ జస్టిస్ ఎన్‌వి రమణ, జస్టిస్ కృష్ణ మురారి, జస్టిస్ హిమా కోహ్లి ధర్మాసనం ఎదుట వాదనలు వినిపిస్తూ ఇది చాలా కీలకమైన అంశమని, దీనిపై అత్యవసర విచారణ అవసరమని చెప్పారు. తమపై ఎక్సయిజ్ దాడులు జరగకుండా చూసుకునేందుకు కోల్‌కతాకు చెందిన ఒక కంపెనీ ఎలెక్టోరల్ బాండ్ల ద్వారా రూ. 40 కోట్లు చెల్లించినట్లు నేటి దినపత్రికలో ఒక వార్త వచ్చిందని, ఇది ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే విషయమని న్యాయవాది తెలిపారు. గతంలో కూడా ఈ పిల్‌పై అత్యవసరంగా విచారణ చేపట్టాలని తాను కోరిన విషయాన్ని ఆయన తెలిపారు. కోవిడ్ లేకపోయుంటే ఈ పిల్‌ను ఏనాడో విచారణకు చేపట్టేవారమని సిజెఐ ఈ సందర్భంగా తెలిపారు. దీనిపై సత్వరమే విచారణ చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన హమీ ఇచ్చారు.