Thursday, January 23, 2025

గీటురాయిపై ఇడబ్ల్యుఎస్ కోటా!

- Advertisement -
- Advertisement -

Supreme Court Grants interim Bail to Teesta Setalvad విద్య, ఉద్యోగాలలో ఆర్థిక బలహీన వర్గాల (ఇడబ్లుఎస్) రిజర్వేషన్లను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణకు ప్రాతిపదికగా మూడు ప్రధాన అంశాలను గుర్తిస్తూ సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయం ఇంత కాలం మూలపడి వున్న ఈ కేసులో పెద్ద కదలికను కలిగించింది. ఈ మూడు అంశాల విశాల ప్రాతిపదిక మీద భారత ప్రధాన న్యాయమూర్తి యు యు లలిత్ నాయకత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ నెల 13న విచారణ చేపడుతుంది. అలాగే తీవ్ర వివాదాస్పదమైన పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) పై దాఖలైన దావాలను కూడా ఈ నెల 12న సుప్రీంకోర్టు విచారణకు స్వీకరిస్తుంది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్ఘానిస్తాన్‌ల నుంచి వలస వచ్చే ముస్లిమేతరులకు పౌరసత్వం కల్పించడానికి ఈ సవరణ చట్టాన్ని తీసుకు వచ్చిన సంగతి, దీనిపై దేశ వ్యాప్తంగా నిరసనలు మిన్నంటిన విషయం తెలిసిందే.

ప్రధాని మోడీ ప్రభుత్వం పార్లమెంటులో గల మెజారిటీని ఉపయోగించుకొని రాజ్యాంగానికి చేసిన వివాదాస్పద సవరణలపై దాఖలైన దావాలను విచారణకు తీసుకోకుండా సుప్రీంకోర్టు వాటిని సుదీర్ఘ కాలం పక్కనపెట్టడం విమర్శలకు దారి తీసింది. ఇప్పుడీ రెండు కేసులను దుమ్ముదులిపి పరిశీలనకు తీసుకోడం ద్వారా సుప్రీంకోర్టు ఒక మంచి పని చేసింది. 10 శాతం ఇడబ్ల్యుఎస్ కోటా కోసం రాజ్యాంగానికి 103 సవరణ తీసుకొచ్చారు. సమానావకాశాలు కల్పిస్తున్న 15, 16 అధికరణలకు ఆరవ క్లాజ్‌ను చేరుస్తూ పార్లమెంటు రాజ్యాంగాన్ని సవరించింది. 15(4), 16(4) అధికరణల ద్వారా కేవలం సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వారికి మాత్రమే రిజర్వేషన్లు కల్పించాలన్నది రాజ్యాంగ కర్తల ఉద్దేశమని, చిరకాలంగా తీవ్రమైన అణచివేతకు, సామాజిక దోపిడీకి గురి అవుతున్న ఎస్‌సి, ఎస్‌టి, ఒబిసిలను ముందుకు తీసుకు రావడానికి మాత్రమే వాటిని ఉద్దేశించారని ఇడబ్లుఎస్ కోటా ఇందుకు పూర్తి విరుద్ధమైనదని, అది రాజ్యాంగ విహితం కాదని వాదిస్తూ పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

ఈ పిటిషన్ల పరిశీలనకు గుర్తించిన మూడు ప్రధాన ప్రాతిపదిక అంశాలలో ఇడబ్లుఎస్ కోటా రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని ఉల్లంఘిస్తున్నదా లేదా అనేది ముఖ్యమైనది. అలాగే ఈ కోటా నుంచి ఎస్‌సి, ఎస్‌టి, ఒబిసిలను ఇతర సామాజికంగా, విద్యావిషయకంగా వెనుకబడిన వారిని ఎందుకు మినహాయించారు అనేది మరో ప్రాతిపదిక ప్రశ్న. ప్రైవేటు, అన్ ఎయిడెడ్ (ప్రభుత్వ సహాయం పొందడం లేని) సంస్థల్లో కూడా ఇడబ్లుఎస్ కోటాను అమలు చేయవచ్చా అనేది మూడవది. 10 శాతం ఇడబ్లుఎస్ కోటా వల్ల రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదని సుప్రీంకోర్టు ఇందిరా సహాని కేసులో విధించిన పరిమితి ఉల్లంఘనకు గురి అవుతున్నది. మొత్తం రిజర్వేషన్లు 60 శాతానికి చేరుకున్నాయి. రాజ్యాంగ మౌలిక స్వరూపం 1973లో కేశవానంద భారతి x కేరళ ప్రభుత్వ కేసులో రూపొందింది. ఆ కేసులో ఇంత వరకు అతిపెద్దదైన 13 మంది న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం 7 6 తేడాతో తీర్పు ఇచ్చింది. రాజ్యాంగంలోని ప్రతి అంశాన్ని సవరించి, దాని మౌలిక స్వరూపాన్ని మార్చివేసే హక్కు పార్లమెంటుకు లేదని ఏడుగురు న్యాయమూర్తులు అభిప్రాయపడగా మిగతా ఆరుగురు అందుకు విరుద్ధమైన తీర్పు ఇచ్చారు. మెజారిటీ తీర్పుగా ఇది రాజ్యాంగాన్ని సవరించే విషయంలో పార్లమెంటు అధికారానికి పరిమితులు విధిస్తున్నది. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, ప్రాథమిక హక్కులు, న్యాయ సమీక్ష, సెక్యులరిజం అనేవి రాజ్యాంగం మౌలిక స్వరూప లక్షణాలని గుర్తించడం జరిగింది.

ఈ తీర్పు తర్వాత ప్రభుత్వం చేసే ఏ చట్టం మంచి చెడ్డలనైనా పరిశీలించి తీర్పు చెప్పే అధికారం సుప్రీంకోర్టుకి దఖలుపడింది. కోర్టుల పరిశీలనకు అతీతం చేస్తూ రాజ్యాంగం తొమ్మిదవ షెడ్యూల్‌లో చేర్చిన చట్టాలపై దాఖలయ్యే వ్యాజ్యాలను విచారణకు స్వీకరించే అధికారం తనకున్నదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ముఖ్యంగా కేశవానంద భారతి కేసులో తీర్పు వెలువడిన 1973 ఏప్రిల్ 24 తర్వాత ఈ షెడ్యూల్‌లో చేర్చిన చట్టాలు ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తున్నట్టు భావిస్తే వాటిపై తాను విచారణ జరపవచ్చునని సుప్రీంకోర్టు ప్రకటించింది. సిజెఐ యు యు లలిత్ ఆధ్వర్యంలోని రాజ్యాంగ ధర్మాసనం గుర్తించిన మూడు ప్రధాన ప్రాతిపదిక అంశాల గీటురాళ్ల మీద ఇడబ్లుఎస్ కోటా నిలబడుతుందా లేదా అనేది అత్యంత కీలకమైన అంశం. అలాగే సుప్రీంకోర్టు విధించిన 50 శాతం పరిమితిని దాటి రిజర్వేషన్ కల్పించడం సబబో కాదో తేలడం సమాజం మీద గట్టి ప్రభావం చూపిస్తుంది. గతంలో ప్రభుత్వాలు 50 శాతం దాటి మైనారిటీలకు, తదితరులకు కేటాయించిన కోటాను కోర్టులు కొట్టివేశాయి. 103 సవరణ తర్వాత ఇడబ్లుఎస్ కోటాకు చట్టబద్ధత వచ్చింది. అది ఏమి కానున్నదో తేల్చే ఈ కేసు విచారణ అమిత ప్రధానమైనది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News