న్యూఢిల్లీ: విద్య, ఉద్యోగాల్లో 10శాతం ఆర్థికంగా బలహీన వర్గాల (ఈడబ్లూఎస్) రిజర్వేషన్ అమలుపై దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు విచారించనుంది. కేంద్రం ప్రకటించిన ఈడబ్లూఎస్ కోటాపై సర్వోన్నత న్యాయస్థానంలో పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. ఈడబ్లూఎస్ రిజర్వేషన్ల రాజ్యాంగ చెల్లుబాటుపై అభ్యంతరాలు వ్యక్తమైన నేపథ్యంలో ఈ నెల 13 నుంచి విచారణ జరపనున్నామని సుప్రీంకోర్టు మంగళవారం తెలిపింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉదయ్ ఉమేశ్ లలిత్‌తో కూడా ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం విచారణ చేపట్టనుంది. సుమారు 40పిటిషన్లు దాఖలవగా పిటిషనర్ల తరఫున న్యాయవాదులు తమ వాదన వినిపించేందుకు 18గంటల సమయాన్ని కోరారు. న్యాయవాదుల వినతిని అంగీకరించిన బెంచ్ తాము మళ్లీ గురువారం సమావేశమై విచారణ సజావుగా జరిగేందుకు తగిన ఆదేశాలు జారీ చేస్తామని తెలిపింది. కాగా ఐదుగురు న్యాయమూర్తుల బెంచ్‌లో సిజెఐ యుయు లలిత్‌తోపాటు జస్టిస్ దినేశ్ ఎస్ రవీంద్ర భట్,బెలా ఎం త్రివేది, జెబి పార్థీవాలా ఉన్నారు. కేంద్రం తరఫున అటార్నీ జనరల్ కెకె వేణుగోపాల్, సొలిసిటర్ జనరల్ మెహతా వాదనలు వినిపించనున్నారు.
ఈడబ్లూఎస్ రిజర్వేషన్‌పై 13నుంచి సుప్రీంకోర్టు విచారణ
- Advertisement -
- Advertisement -
- Advertisement -