Monday, December 23, 2024

సుప్రీంకోర్టులో కవిత పిటిషన్‌పై విచారణ.. మార్చి 13కి వాయిదా

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : సుప్రీంకోర్టులో బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కవిత కేసు వచ్చే నెల 13కి వాయిదా పడింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఇడి నోటీసులను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో కవిత వేసిన పిటిషన్‌పై బుధవారం విచారణ జరగాల్సి ఉండగా సమయం లేకపోవడంతో నేడు ధర్మాసనం విచారణ జరపలేదు. విచారణను న్యాయస్థానం మార్చి 13 కు వాయిదా వేసింది. తనపై ఇడి ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోకుం డా ఆదేశాలివ్వాలని సుప్రీంను కవిత కోరారు. అయితే సుప్రీం కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు. ఈ స్కామ్‌కు సంబంధించి పలు మార్లు విచారణకు హాజరైన తర్వాత నిరుడు మార్చిలో కవిత సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఆమె తరపు అడ్వొకేట్ వందన సెఘల్ మొత్తం 105 పేజీలతో కూడిన రిట్‌పిటిషన్‌ను దాఖలు చేశారు. అప్పట్లో ఈ పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం కేంద్ర మాజీ మంత్రి చిదంబరం సతీమణి నళిని చిదంబరం, బెంగాల్ సిఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ పిటిషన్లతో ట్యాగ్ చేసింది.

అయితే ఇటీవల ఈ పిటిషన్లు మరోసారి జస్టిస్ బెల ఎం.త్రివేది, జస్టిస్ పంకజ్ మిత్తల్ తో కూడిన బెంచ్ ముందుకు రాగా ఎందుకు అన్ని పిటిషన్లను కలిపి విచారించాలని ధర్మాసనం ప్రశ్నించింది. అన్ని పిటిషన్లు కలిపి విచారణ చేపట్టాలని తాము భావించడం లేదని తెలిపింది. తాజాగా సిబిఐ నోటీసుల నేపథ్యంలో కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందోనన్న ఆసక్తి ఏర్పడింది. ఈ పిటిషన్‌పై తుది వాదనలు వింటామని ధర్మాసనం పేర్కొనడంతో విచారణ జరుగుతుందని అనుకున్నారు. కానీ విచారణ వాయిదా పడింది. ఈ పిటిషన్‌ను చూపుతూ తాజాగా ఇడి విచారణకు కవిత గైర్హాజరయ్యారు. అలాగే సిబిఐ ఇచ్చిన సమన్ల వ్యవహారంలో సమాధానం ఇచ్చిన కవిత ఈ కేసులోని అంశాలను వివరిస్తూ లేఖ రాసి విచారణకు హాజరయ్యేది లేదన్నారు. ఇడి కేసులో తనను విచారణకు పిలవబోమని అదనపు సొలిసిటర్ జనరల్ సుప్రీంకోర్టులో హామీ ఇచ్చార న్నారు.

ఇదే హామీ సిబిఐకి కూడా వర్తిస్తుందని తన రిప్లైలో ప్రస్తావించారు. సుప్రీంకోర్టులో విచారణ జరగకపోవడతో ఇడి విచారణకు పిలవడం పై ఆంక్షలు ఉన్నట్లే అనుకోవచ్చు. అయితే సిబిఐ విషయంలో మాత్రం స్పష్టత లేదు. విచారణకు హాజరు కానందున సిబిఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నదానిపైనా స్పష్టత లేదు. మరోసారి నోటీసులు జారీ చేస్తుందా? లేకపోతే సుప్రీంకోర్టులో పిటిషన్ విచారణలో ఉన్నందున ఇడి లాగే ఎదురు చూస్తుందా? అన్నది తేలాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News