Monday, December 23, 2024

దేశద్రోహ చట్టాన్ని రద్దు చేయాల్సిన అవసరం లేదు… కానీ

- Advertisement -
- Advertisement -

Supreme Court Hearing on Sedition Law

మార్గదర్శకాలు జారీ చేయాలని సుప్రీంను కోరిన అటార్నీ జనరల్
విస్తృత ధర్మాసనానికి బదిలీపై మే 10 న నిర్ణయం

న్యూఢిల్లీ : బ్రిటిష్ కాలం నాటి దేశద్రోహ చట్టాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను విస్తృత ధర్మాసనానికి బదిలీ చేయాలా వద్దా అన్న దానిపై త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్టు సుప్రీం కోర్టు గురువారం వెల్లడించింది. దీనిపై మే 10 న విచారణ చేపట్టనున్నట్టు తెలిపింది. ఈ సందర్భంగా కేంద్రం తీరుపై సర్వోన్నత న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసింది. ఈ పిటిషన్‌పై చీఫ్ జస్టిస్ ఎన్.వి రమణ నేతృత్వం లోని ధర్మాసనం నేడు విచారణ చేపట్టింది. ఈ పిటిషన్‌పై స్పందించాలని కేంద్రానికి గతం లోనే నోటీసులు జారీ చేసినా, ఇంతవరకు ఎందుకు సమాధానం ఇవ్వలేదని ప్రశ్నించింది. దీనికి సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్పందిస్తూ … లాయర్ల స్థాయిలో సిద్ధమైన డ్రాఫ్ట్ నివేదికకు ఇంకా అథారిటీ స్థాయిలో ఆమోదం లభించలేదు. అందువల్ల సమాధానం చెప్పేందుకు మరింత గడువు అవసరం అని న్యాయస్థానాన్ని కోరారు. దీంతో ఈ విచారణను మే 10 వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేస్తున్నట్టు సీజేఐ వెల్లడించారు.

వచ్చే సోమవారం నాటికి కోర్టు కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించారు. ఈ కేసులో మరిన్ని వాయిదాలు ఇప్పుడు సాధ్యం కాదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా దేశద్రోహులపై దాఖలైన పిటిషన్లను విస్తృత ధర్మాసనానికి పంపించే అంశంపై అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ అభిప్రాయాన్ని న్యాయస్థానం కోరింది. దీనికి ఏజీ స్పందిస్తూ , ప్రస్తుతం దేశంలో ఏం జరుగుతోందో మీకు తెలుసు. హనుమాన్ చాలీసా చదువుతామని చెప్పిన వారిపైనా దేశద్రోహం కేసులు పెడుతున్నారు. అందువల్ల ఈ చట్టం దుర్వినియోగం కాకుండా మార్గదర్శకాలు జారీ చేయాలి. అంతేకానీ దీనిపై విస్తృత ధర్మాసనం ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదు అని అభిప్రాయపడ్డారు.

మహారాష్ట్ర స్వతంత్ర ఎంపీ నవనీత్ రాణా దంపతుల కేసును ఉటంకిస్తూ ఏజీ ఈ వ్యాఖ్యలు చేశారు. దేశద్రోహ చట్టం 124 ఏ రాజ్యాంగ బద్ధతను సవాల్ చేస్తూ ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా, మాజీ మేజర్ జనరల్ ఎస్‌జీ వాంబత్ కెరెతోపాటు పలువులు గతేడాది జులైలో సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వీటి విచారణను స్వీకరించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వి రమణ నేతృత్వం లోని ధర్మాసనం… మహాత్మా గాంధీ లాంటి స్వాతంత్య్ర సమర యోధుల గళాన్ని అణగదొక్కేందుకు నాటి బ్రిటిష్ అధికారులు ఉపయోగించిన ఈ చట్టాన్ని కేంద్రం ఎందుకు రద్దు చేయట్లేదు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అయినా ఇవి మనకు అవసరమా? అని ప్రశ్నించింది. ఈ చట్టాన్ని దుర్వినియోగం చేయడం ఆందోళన కలిగిస్తోందని అభిప్రాయపడింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News