Monday, December 23, 2024

‘ఇడి’ కేసులపై సుప్రీంకోర్టు అసహనం!

- Advertisement -
- Advertisement -

సంపాదకీయం: విపక్ష పార్టీల నేతలే లక్షంగా కొనసాగుతున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాడుల కేసుల డొల్లతనాన్ని సాక్షాత్తు సుప్రీంకోర్టు గణాంకాల సాక్షిగా ఎండగట్టిన తీరు కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రధాని మోడీ ప్రభుత్వానికి చెంపదెబ్బేనని చెప్పక తప్పదు. రాజకీయ కక్ష సాధింపులకు ఇడి, సిబిఐలు కేంద్రంలోని అధికార పక్షం చేతుల్లో పావులుగా మారాయనే విధంగా సుప్రీంకోర్టు కేసుల తీరుపై అసహనం వ్యక్తం చేసింది. మనీలాండరింగ్ కేసుల్లో నమోదవుతున్న వాటిలో ఎక్కువ శాతం శిక్షలే పడడం లేదని, ఈ విషయంలో ఇడి సాక్షాధారాలు సమర్పించడంలో విఫలమవుతున్నాయని సుప్రీంకోర్టు ఆగస్టు 7వ తేదీన వ్యాఖ్యానించడం తీవ్రమైన విషయం.

యుపిఎ హయాంలో ఇడి నమోదు చేసిన కేసులు, జప్తు చేసిన ఆస్తులు, ఎన్‌డిఎ ఏలుబడిలో పదేళ్ళ నుంచి జరుగుతున్న కేసులు, జప్తులను పరిశీలిస్తే ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడుతున్నాయి. యుపిఎ ప్రభుత్వ హయాంలో (2004 05 నుంచి 201314) ఇడి జప్తు చేసిన ఆస్తుల పరిస్థితి పరిశీలిస్తే కేవలం రూ. 5346 కోట్ల ఆస్తులే జప్తు కాగా, మోడీ ప్రభుత్వం వచ్చిన తరువాత 2014 నుంచి 2022 వరకు రూ. 99,356 కోట్ల విలువైన ఆస్తులు జప్తు అయ్యాయి. అలాగే ఇడి కేసుల్లో 95 శాతం ప్రతిపక్షపాలిత రాష్ట్రాల్లో నమోదైనవే. బిజెపి పాలిత రాష్ట్రాలన్నిటా సత్యహరిశ్చంద్రులే ఉన్నట్టు, విపక్ష రాష్ట్రాల పాలకులు అవినీతి పరులైనట్లుగా ఈ దాడులు సాగుతుండడంలో ఆంతర్యం ప్రశ్నార్థకంగా మారింది. అంతేకాదు ఇడి విశ్వసనీయతకే ఇది సవాలు.

నగదు అక్రమ చలామణి జరిగిందని పెడుతున్న కేసుల్లో చాలా వరకు శిక్షలు పడటమనేది చాలా తక్కువగా జరుగుతోందని సుప్రీం కోర్టు బుధవారం (ఆగస్టు 7) నాడు వ్యాఖ్యానించడం గమనార్హం. పక్కాగా సాక్షాధారాలు సేకరించడంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వైఫల్యాన్ని సుప్రీం మరోసారి ఎత్తిచూపింది. 20142024 మధ్య కాలంలో నగదు అక్రమ చలామణి నిరోధ చట్టం కింద 5297 కేసులు పెట్టగా, వాటిలో 40 కేసుల్లో మాత్రమే శిక్షలు పడ్డాయని కేంద్ర హోం శాఖ మంగళవారం లోక్‌సభకు తెలియజేసింది. దీన్ని బట్టి ఇడి దర్యాప్తు ఎలా ఉంటుందో తెలుస్తుంది. ఈ కేసుల్లో శిక్షల రేటును పెంచడానికి శాస్త్రీయ దర్యాప్తు పద్ధతులను పాటించాలని ఇడికి సుప్రీం సలహా ఇవ్వడం గమనార్హం. ఇదిలా ఉండగా బెంగళూరులో తాజాగా ఇడి అధికారులకు వ్యతిరేకంగా హైకోర్టులో కేసు దాఖలైంది.

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి)కి చెందిన ఇద్దరు అధికారులపై కర్ణాటక పోలీస్‌లు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం అనూహ్య పరిణామం. ఎందుకు వారిపై కేసు నమోదు చేయవలసి వచ్చిందో ఆరా తీస్తే మహర్షి వాల్మీకి ఎస్‌టి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కుంభకోణం కేసులో మాజీ మంత్రి బి. నాగేంద్ర, ముఖ్యమంత్రి సిద్దరామయ్య పేర్లను చేర్చడానికి ఇడి అధికారులు తమపై ఒత్తిడి తెస్తున్నారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ అదనపు డైరెక్టర్ కల్లేష్ బి దాఖలు చేసిన ఫిర్యాదే కారణమని బయటపడింది. ఈ కేసులో నిజానిజాలు ఎలా ఉన్నా ఇడి అధికారులు ఇద్దరిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడంపై కర్ణాటక హైకోర్టు మంగళవారం (23న) స్టే విధించింది.దీనిపై విచారణ ఆగస్టు 21కి వాయిదా వేసింది. చాలా కేసుల దర్యాప్తులో ఇడి తనకున్న అసాధారణ అధికారాలతో దూకుడుగా వ్యవహరిస్తోందని గత కొన్ని సంఘటనల బట్టి తెలుస్తోంది. గత ఏడాది మేలో ఇడి దర్యాప్తు తీరుపై ఎన్నో ఫిర్యాదులు రావడంతో సుప్రీంకోర్టు తీవ్రంగా మందలించింది.

దర్యాప్తుల సమయంలో భయోత్పాత వాతావరణం సృష్టించ వద్దని హెచ్చరించింది. అయినాసరే ఇడి వ్యవహారంలో మార్పు రాలేదన్న విమర్శలు వస్తున్నాయి. గత ఏడాది రూ. 2000 కోట్ల మద్యం కుంభకోణానికి సంబంధించిన కేసులో అప్పటి చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ భగేల్‌ను ఇరికించడానికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) ప్రయత్నిస్తోందని, దీని కోసం తమ రాష్ట్రం లో భయానక పరిస్థితిని కల్పిస్తోందంటూ చత్తీస్‌గఢ్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు ఫిర్యాదు చేసింది. దీంతో జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ అసనుద్దీన్ అమానుల్లాలతో కూడిన ఆనాటి ధర్మాసనం ఇడి తీరును ఆక్షేపించింది. విధి నిర్వహణలో భాగంగా అవతలివారిని భయపెట్టడం మంచిది కాదని, అలా చేస్తే మంచి కన్నా చెడే ఎక్కువగా జరుగుతుందని హెచ్చరించింది. దర్యాప్తు కోసం చేసే ప్రయత్నాలను కూడా అనుమానించవలసిన పరిస్థితి ఏర్పడుతుందని మందలింది. అదే సమయంలో ఈ కేసు విచారణ సమయంలో తెల్లకాగితాల మీద, ముందే తయారు చేసిన పత్రాల పైన సంతకాలు చేయాలని ఇడి బలవంతం పెట్టిందని, తమను శారీరక, మానసిక హింసకు గురి చేసిందని చత్తీస్‌గఢ్ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ అధికారులు 52 మంది ఫిర్యాదు చేశారు. బెదిరింపులు, బలవంతపు సంతకాలు లాంటివి ఇడి ప్రతిష్ఠను మునుపెన్నడూ లేని విధంగా దెబ్బ తీస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News