Monday, December 23, 2024

20 మంది ఎమ్‌ఎల్‌ఎల మద్దతు లేని వ్యక్తికి అధికారమా ?

- Advertisement -
- Advertisement -

Supreme Court is hearing the plea by Uddhav Thackeray

సుప్రీం కోర్టులో ఉద్ధవ్ థాక్రేపై షిండే వర్గం తీవ్ర వ్యాఖ్యలు
విస్తృత ధర్మాసనానికి పిటిషన్లు బదిలీ చేసే అవకాశం

న్యూఢిల్లీ : మహారాష్ట్రలో ఇటీవల శివసేన సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయేందుకు దారి తీసిన రాజకీయ సంక్షోభంపై దాఖలైన పలు పిటిషన్లపై సుప్రీం కోర్టు బుధవారం విచారణ చేపట్టింది. మాజీ సిఎం ఉద్ధవ్ థాక్రే వర్గం , ప్రస్తుత ముఖ్యమంత్రి షిండే వర్గం మధ్య వాడివేడి వాదనలు జరిగాయి. ఇరు పక్షాల వాదనలు విన్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వి రమణ నేతృత్వం లోని ధర్మాసనం, ఈ పిటిషన్లను ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన విస్తృత ధర్మాసనానికి బదిలీ చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయ పడింది. థాక్రే వర్గం దాఖలు చేసిన పిటిషన్లపై అఫిడవిట్ దాఖలు చేయాలని షిండే వర్గాన్ని ఆదేశించింది. ఈ కేసులో తదుపరి విచారణను ఆగస్టు 1 నాటికి వాయిదా వేసింది. అప్పటిదాకా అనర్హత నోటీసులపై స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకోకుండా యథాతధ స్థితిని కొనసాగించాలని స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించిన అన్ని రికార్డులను భద్రపర్చాలని మహారాష్ట్ర అసెంబ్లీ సెక్రటరీకి సూచించింది. అంతకు ముందు థాక్రే వర్గం తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. సంక్షోభ పరిస్థితులపై సుప్రీం కోర్టులో విచారణ పెండింగ్‌లో ఉండగానే షిండే తో గవర్నర్ ఎలా ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయిస్తారని ప్రశ్నించారు. అనర్హత నోటీసులు ఉన్న ఎమ్‌ఎల్‌ఎలు ఓటేసిన అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక చెల్లదని వాదించారు. ఈ కేసులో షిండే వర్గానికి అనుకూలంగా తీర్పు వస్తే దేశంలో ప్రతి ఎన్నికైన ప్రభుత్వాన్ని ఇలాగే కూల్చుతారు. రాష్ట్ర ప్రభుత్వాలు కుప్పకూలితే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందని సిబల్ తన వాదనలు వినిపించారు.

మనం ఊహా ప్రపంచంలో ఉన్నామా ? :షిండే వర్గం
అయితే థాక్రే వర్గం వాదనలపై షిండే వర్గం కూడా దీటుగానే బదులిచ్చింది. షిండే వర్గం తరఫున మరో సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే వాదనలు వినిపించారు. పార్టీలో ఒక వ్యక్తికి అధిక మద్దతు ఉంటే అతను పార్టీని విడిచిపెట్టకుండా నాయకుడిని ప్రశ్నిస్తే అది ఫిరాయింపు ఎలా అవుతుంది ? పార్టీలో అధిక మంది సభ్యులు మరో వ్యక్తి సారథిగా ఉండాలనుకుంటే అందులో తప్పేముంది ? కనీసం 20 మంది ఎమ్‌ఎల్‌ఎల మద్దతు సమకూర్చుకోలేని ఓ వ్యక్తి కోర్టుల ద్వారా అధికారం లోకి రావాలనుకునే ఊహా ప్రపంచంలో మనం ఉన్నామా ? అని ప్రశ్నించారు. వాదోపవాదాలు విన్న సిజేఐ నేతృత్వం లోని ధర్మాసనం , విచారణను వాయిదా వేసింది. ఏయే అంశాలను ధర్మాసనానికి బదిలీ చేయాలన్న వివరాలను వ్యాజ్యదారులు జులై 27 లోగా కోర్టుకు తెలియజేయాలని సూచించింది. మహా రాజకీయ సంక్షోభానికి సంబంధించి సుప్రీం కోర్టులో మొత్తం ఆరు పిటిషన్లు దాఖలయ్యాయి. ఇందులో ఒకటి షిండే వర్గం దాఖలు చేయగా, మిగతా ఐదు థాక్రే వర్గం దాఖలు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News