లఖింపూర్ ఖేరి కేసులో యుపి ప్రభుత్వం తీరుపై మళ్లీ సుప్రీంకోర్టు అసహనం
మరింత మంది సాక్షులను గుర్తించి వారి స్టేట్‌మెంట్లు రికార్డు చేయాలని ఆదేశం
న్యూఢిల్లీ: లఖింపూర్ ఖేరీ కేసు విషయంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తీరుపై సుప్రీంకోర్టు మంగళవారం మరోసారి అసహనం వ్యక్తం చేసింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆ కేసులో కేవలం 23 మంది ప్రత్యక్ష సాక్షులే ఎందుకు ఉన్నారని నిలదీసింది. ఇంకా ఎక్కువ మంది సాక్షులను గుర్తించి వారికి రక్షణ కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ‘ఈ కేసుకు సంబంధించి కేవలం 23మంది ప్రత్యక్ష సాక్షులే ఎందుకు ఉన్నారు? ఇంకా ఎక్కువ మంది సాక్షులను గుర్తించి, వారి వాంగ్మూలాలను రికార్డు చేయాలి. అలాగే వారికి రక్షణ కల్పించాలి. వాంగ్మూలాలు రికార్డు చేయడంలో ఏదైనా ఇబ్బంది ఎదురైనా, తగిన న్యాయసిబ్బంది అందుబాటులో లేకపోయినా, దగ్గర్లోని జిల్లా న్యాయమూర్తి తగిన ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేయాలి’ అని చీఫ్ జస్టిస్ ఎన్‌వి రమణ నేతృత్వంలోని మెంచ్ ఆదేశించింది. విచారణ సందర్భంగా యుపి ప్రభుత్వం తరఫునసీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే వాదనలు వినిపించారు.
ఈ కేసుకు సంబంధించి 68 మంది సాక్షులున్నారని, వీరిలో 23 మంది ప్రత్యక్ష సాక్షులని, మరో 30 మంది సాక్షాలను రికార్డు చేశామని తెలిపారు. ఈ వాదనలపై ప్రధాన న్యాయమూర్తి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ‘ 4 5 వేల మందితో ర్యాలీ తీస్తుండగా ఈ ఘటన జరిగింది. కానీ మీకు మాత్రం 23 మంది సాక్షులే కనిపించారా? మీ ఏజన్సీలకు చెప్పి మరింత మంది స్టేట్స్‌మెంట్లు రికార్డు చేయించండి’ అని ఆదేశించారు. తదుపరి విచారణను వచ్చే నెల 8కి వాయిదా వేసింది. గత వారం విచారణ సందర్భంగాను సుప్రీంకోర్టు యుపి ప్రభుత్వం వైఖరిపై అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ కేసును అంతులేని కథగా మార్చవద్దంటూ చురకలు వేసింది. సాగు చట్టాల్లకు వ్యతిరేకంగా గత అక్టోబర్ 3న లఖింపూర్ ఖేరిలో ఆందోళన సందర్భంగా జరిగిన హింసాకాండపై సుప్రీంకోర్టు విచారణ జరుపుతోంది. ఈ హింసాకాండలో నలుగురు రైతులు సహా 8 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. దీనిపై విపక్షాలనుంచి తీవ్ర నిరసన వ్యక్తమయింది. కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా సహా పదిమంది నిందితులను ఇప్పటివరకు అరెస్టు చేశారు.