తమిళనాడు శాసనసభ పంపిన పది బిల్లులను ఎలాంటి కారణం లేకుండా మూడేళ్లపాటు తమిళనాడు గవర్నర్ తన వద్దనే అట్టే పెట్టుకోవడంపై ఇటీవల సుప్రీం కోర్టు తీవ్రంగా మందలించిన సంగతి తెలిసిందే. గవర్నర్‌కు తన రాజ్యాంగ పరిధి, బాధ్యతలు ఎంతవరకో గుర్తు చేసింది. ఈసారి గవర్నర్లు రాష్ట్రపతి పరిశీలన కోసం పంపే బిల్లులపై సుప్రీం కోర్టు సంచలనాత్మక తీర్పు వెలువరించింది. ముఖ్యంగా గవర్నర్లు పంపిన బిల్లులపై రాష్ట్రపతి మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని గడువు నిర్దేశిస్తూ సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వడం ఇదే తొలిసారి. తమిళనాడు శాసనసభ ఆమోదించిన 10 బిల్లులను ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్‌ఎన్ రవి 2020 నుంచి పెండింగ్‌లో ఉంచారు.ఈ బిల్లుల్లో యూనివర్శిటీ వైస్‌ఛాన్సలర్ల నియామకం, ఖైదీల ముందస్తు విడుదల, పబ్లిక్ సర్వెంట్స్‌పై ప్రాసిక్యూషన్ వంటి కీలకమైన బిల్లులున్నాయి. వీటిని మూడేళ్లుగా తొక్కిపెట్టి 2023లో రాష్ట్రపతి పరిశీలనకు పంపడం వివాదాస్పదమైంది.
ఇలా తొక్కిపెట్టడం రాజ్యాంగ విరుద్ధమని ఇటీవలనే సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. ఏదైనా బిల్లును మంత్రిమండలి సలహామేరకు రాష్ట్రపతి ఆమోదం కోసం పెండింగ్‌లో ఉంచాలనుకుంటే దానికి గవర్నర్ తీసుకోదగిన అత్యధిక గడువు ఒక నెల మాత్రమేనని స్పష్టం చేసింది. శాసనసభ ఆమోదించిన బిల్లులపై గవర్నర్ చర్యలు తీసుకోవడానికి గడువును నిర్దేశిస్తూ సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఒకవేళ మంత్రి మండలి సలహా లేకుండా గవర్నర్ బిల్లు ఆమోదాన్ని ఆపాలనుకుంటే మూడు నెలల్లోగా అలాంటి బిల్లును శాసనసభకు తిరిగి పంపించాలని సూచించింది. తమిళనాడు గవర్నర్ రవి చట్టవిరుద్ధంగా వ్యవహరించడం వల్ల సుప్రీం కోర్టు తన అసాధారణ అధికారాలు (ఆర్టికల్ 142) ఉపయోగించి, ఈ బిల్లులను శాసనసభ మళ్లీ పంపిన తేదీ నాటికి గవర్నర్ అంగీకరించినట్టు డీమ్డ్ అసెంట్‌గా ప్రకటించింది.
గవర్నర్ ఈ గడువును పాటించని పక్షంలో ఆయన చర్యపై కోర్టులు న్యాయసమీక్ష జరపవచ్చని వెల్లడించింది. మంత్రిమండలి సలహా సూచనల మేరకు తప్పనిసరిగా పనిచేయడం తప్ప గవర్నర్‌కు విచక్షణాధికారాలేవీ లేవని, రాజ్యాంగంలోని 200వ అధికరణం కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోందని తెలియజేసింది. రెండోసారి సమర్పించిన బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం రిజర్వు చేసి ఉంచే అధికారం గవర్నర్‌కు లేదంది. ఇదే విధంగా ఆర్టికల్ 201 కింద రాష్ట్రపతి పరిశీలనకోసం గవర్నర్లు పంపే బిల్లులను మూడు నెలలకు మించి ఉంచకూడదని జస్టిస్ జేబీ పార్ధీవాలా, జస్టిస్ మహదేవన్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. ఒకవేళ జాప్యం జరిగితే దానికి కారణాలను రాష్ట్రాలకు రాష్ట్రపతి భవన్ వివరించాల్సి ఉంటుందని తెలియజేసింది. ఒకవేళ నిర్ణీత సమయంలోనూ రాష్ట్రపతి నుంచి సరైన స్పందన లేకుంటే మాండమస్ రిట్ పిటిషన్ దాఖలు చేయవచ్చని రాష్ట్రాలకు సుప్రీం కోర్టు సూచించింది.
మాండమస్ రిట్ అంటే ఒక కోర్టు నుండి ప్రభుత్వ అధికారి లేదా సంస్థకు జారీ చేసే ఆజ్ఞాపన. దానిద్వారా ఆ అధికారి లేదా సంస్థ తన చట్టబద్ధమైన బాధ్యతలను నిర్వర్తించాలని కోర్టు ద్వారా ఆదేశించడం. గవర్నర్లు రాష్ట్రపతి బిల్లులను అనవసరంగా ఆలస్యం చేయడం వల్ల రాష్ట్రాల శాసనసభల హక్కులు ఉల్లంఘనకు గురవుతున్నాయన్న విమర్శలు వస్తున్నాయి. ఎన్నికైన శాసనసభలు ప్రజల అభీష్టాన్ని ప్రతిబింబిస్తాయి. గవర్నర్ లేదా రాష్ట్రపతి అనవసర జోక్యం దీన్ని దెబ్బతీస్తుందని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఆర్టికల్ 201లో నిర్దేశిత గడువు లేని లోటును సరిచేస్తూ సర్కారియా కమిషన్ (1983), పుంఛి కమిషన్ (2007) సిఫార్సులను ఆధారంగా చేసుకుని సుప్రీం కోర్టు మూడు నెలల గడువు విధించడం గమనార్హం. ఒకవేళ బిల్లు గాని రాజ్యాంగానికి విరుద్ధంగా ఉంటే ఆర్టికల్ 143 ప్రకారం సుప్రీం కోర్టును సంప్రదించడానికి రాష్ట్రపతికి అవకాశం ఉందని సూచించింది.
రాష్ట్రపతి వద్ద రాష్ట్రాల బిల్లులు పెండింగ్‌లో ఉండిపోవడం, తీవ్ర జాప్యం జరగడంతో సంబంధిత రాష్ట్రాలు సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. రాష్ట్రాలు కూడా తాము శాసనసభల్లో బిల్లులను ప్రవేశపెట్టేముందు రాజ్యాంగపరమైన ప్రయోజనాలకు సంబంధించిన ఆయా అంశాలపై రాష్ట్రపతి ఆమోదం ఎంత అవసరమో కేంద్ర ప్రభుత్వంతో చర్చించడం అవసరమని సుప్రీం కోర్టు ధర్మాసనం సిఫార్సు చేసింది. అదే విధంగా రాష్ట్రాలు పంపిన బిల్లుల విషయంలో వేగంగా రాష్ట్రపతి నుంచి ఆమోదం పొందేలా కేంద్రం కూడా పరిశీలించాలని సూచించింది. ఇలాంటి ఆచరణాత్మక సమన్వయం వల్ల కేంద్రంరాష్ట్రాల మధ్య ప్రారంభంలో ఘర్షణ తలెత్తకుండా భవిష్యత్తులో ఎలాంటి ఆటంకాలు ఎదురవ్వకుండా సానుకూల పరిస్థితి ఏర్పడుతుందని సూచించింది. ఫలితంగా ప్రజాసంక్షేమం సిద్ధిస్తుందని ధర్మాసనం అభిప్రాయపడింది.
రాష్ట్రపతి వద్ద తమ బిల్లులు ఆమోదంపొందకుండా విపరీతంగా ఆలస్యమవుతున్నాయని వాదిస్తూ కేరళ తదితర రాష్ట్రాలు సుప్రీం కోర్టును ఆశ్రయించడం పరిపాటిగా వస్తోంది. తాము పంపిన నాలుగు బిల్లులు రాష్ట్రపతి వద్దనే ఉండిపోయాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు వ్యతిరేకంగా కేరళ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో ఇటీవల రిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు సంచలనాత్మక తీర్పు గవర్నర్లు, రాష్ట్రపతి బిల్లులపై తీసుకునే నిర్ణయాల్లో ఎక్కువ పారదర్శకత, జవాబుదారీతనం తెస్తుందన్న దృఢవిశ్వాసం కలుగుతోంది. ఈ తీర్పుతో తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజ్యాంగ చరిత్రలో తొలిసారి రాష్ట్రపతి, గవర్నర్ ఆమోదం లేకుండానే 10 చట్టాలను ప్రభుత్వం నోటిఫై చేసింది. ఈమేరకు గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది.