Friday, December 20, 2024

లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు సుప్రీం నోటీసు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: తనను పార్లమెంట్ నుంచి బహిష్కరించడాన్ని సవాలు చేస్తూ తృణమూల్ కాంగ్రెస్(టిఎంసి) నాయకురాలు మహువా మొయిత్ర దాఖలు చేసిన పిటిషన్‌పై లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు బుధవారం సుప్రీంకోర్టు నోటీసు జారీచేసింది. పార్లమెంట్‌లో అదానీ గ్రూపునకు సబంధించిన ప్రశ్నలను వేసేందుకు దుబాయ్‌కు చెందిన వ్యాపారి దర్శన్ హీరానందానికి తన తన లోక్‌సభ వెబ్‌సైట్ అకౌంట్ లాగిన్ వివరాలను అందచేశారన్న ఆరోపణపై మహువా మొయిత్రాను లోక్‌సభ సభ్యత్వం నుంచి స్పీకర్ బహిష్కరించారు.

ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ దశలో పిటిషనర్‌కు ఎటువంటి మధ్యంతర ఊరటను కల్పించలేమని స్పష్టం చేసింది. ఈ కేసులో న్యాయ సమీక్షను జరిపే హక్కు, పరిధితోసహా అన్ని అంశాలను పరిశీలించాల్సి ఉందని ధర్మాసనం పేర్కొంది. అనేక అంశాలను పిటిషనర్ లేవనెత్తారని, వాటి గురించి తాము వ్యాఖ్యానించదలచలేదని లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు జారీచేసిన నోటీసులో ధర్మాసనం పేర్కొంది. మూడు వారాలలో నోటీసుకు సమాధానం ఇవ్వాలని సెక్రటరీ జనరల్ తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ధర్మాసనం కోరింది.

అదే విధంగా పిటిషనర్ తన ప్రతిస్పందనను మూడు వారాలలో తెలియచేయడానికి ధర్మాసనం అనుమతి ఇచ్చింది. ఈ కేసు తదుపరి విచారణ మార్చి 11 నుంచి ప్రారంభం అయ్యే వారంలో ఉంటుందని కోర్టు తెలిపింది. పిటిషనర్ మహువా మొయిత్ర తరఫున సీనియర్ న్యాయవాది ఎఎం సింఘ్వి వాదనలు వినిపిస్తూ లోక్‌సభ కార్యకలాపాలలో మహువా పాల్గొనేందకు అనుమతించాలని కోర్టును కోరారు. తాము దీనికి అంగీకరించబోమని, అలా చేస్తే పిటిషన్‌ను విచారణకు స్వీకరించినట్లు అవుతుందని ధర్మాసనం స్పష్టం చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News