వీడ్కోలు సమావేశంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బోబ్డే
న్యూఢిల్లీ: ప్రధాన న్యాయమూర్తిగా తన శక్తిమేరకు విధులు నిర్వర్తించాననే పూర్తి సంతృప్తితో పదవీ విరమణ చేస్తున్నానని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఎ బోబ్డే అన్నారు. శుక్రవారం పదవీ విరమణ చేస్తున్న ఎస్‌ఎ బోబ్డేకు సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో తదుపరి సిజెఐ ఎన్‌వి రమణ, న్యాయమూర్తులు, అటార్నీ జనరల్, సొలిసిటర్ జనరల్, బార్ అసోసియేషన్ సభ్యులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా బోబ్డే మాట్లాడుతూ, ఎన్నో జ్ఞాపకాలు, సంతోషం, సద్భావనతో సుప్రీంకోర్టును విడిచి వెళుతున్నాని పేర్కొన్నారు. ప్రధాన న్యాయమూర్తిగా చివరి రోజు మిశ్రమ అనుభూతిని మిగిల్చిందన్నారు. న్యాయమూర్తిగా 21 సంవత్సరాలు విధులు నిర్వర్తించిన తర్వాత తాను పదవినుంచి వైదొలుగుతున్నానని, కాలం తనకు ఎన్నో జ్ఞాపకాలను మిగిల్చిందంటూ ఉద్వేగానికి లోనయ్యారు. సోదర న్యాయమూర్తులతో కలిసి పని చేయడం అద్భుతంగా ఉందన్నారు. తన స్థానంలో సిజెఐగా బాధ్యతలు చేపట్టనున్న ఎన్‌వి రమణ తన విధులను సమర్థవంతగా నిర్వహిస్తారని వ్యాఖ్యానించారు. కరోనా సమయంలో జస్టిస్ బోబ్డేప్రాంభించిన వర్చువల్ విధానంతో 50 వేల కేసులు పరిష్కారమయ్యాయని అటార్నీ జనరల్ కెకె వేణు గోపాల్ అన్నారు. ఇది చాలా గొప్ప విషయమని ఆయన కొనియాడారు. సిజెఐ పదవీ కాలం కనీసం మూడేళ్లు ఉండాలని ఆయన అన్నారు. జస్టిస్ బోబ్డే తెలివైన, వివేకవంతమైన న్యాయమూర్తి అని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ప్రశంసించారు. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, సీనియర్ అడ్వకేట్ వికాస్ సింగ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జస్టిస్ బోబ్డే అయోధ్య సహా పలు చారిత్రాత్మక కేసుల్లో తీర్పులు వెలువరించారు. 2019 నవంబర్‌లో 47వ సిజెఐగా బోబ్డే బాధ్యతలు చేపట్టారు.
48వ సిజెఐగా నేడు రమణ ప్రమాణం
కాగా సుప్రీంకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన ఎన్‌వి రమణ శనివారం పదవీ బాధ్యతలు స్వీకరిస్తారు. శనివారం ఉదయం 48వ సిజెఐగా రమణ చేత రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో కొద్ది మంది అతిథుల సమక్షంలో ఈ కార్యక్రమం జరగనున్నట్లు సమాచారం. ప్రధాని నరేంద్ర మోడీ, ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, కేబినెట్ మంత్రులు,న్యాయమంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు, రమణ కుటుంబ సభ్యులు మాత్రమే ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశముంది.